మహారాష్ట్రలో మరాఠీని భారత్లో హిందువును.. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే పాత వీడియో వైరల్

మహారాష్ట్రలో మరాఠీని భారత్లో హిందువును.. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే పాత వీడియో వైరల్

ముంబై: హిందీ భాష వివాదం మహారాష్ట్రలో రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీస్తున్నది. త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర సర్కారుపై పోరాటం కోసం 20 ఏండ్ల తర్వాత ఒక్కటైన సోదరులు, శివసేన (యూబీటీ) చీఫ్​ ఉద్ధవ్​ థాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్​ రాజ్ థాక్రేను టార్గెట్​ చేస్తూ సోషల్​ మీడియాలో బీజేపీ నేతలు పోస్టులు పెడుతున్నారు. 

తాను మహారాష్ట్రలో మరాఠీని.. భారత్​లో హిందువును అంటూ శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే గతంలో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ‘‘భుజాలపై కాషాయ రంగు శాలువా ధరించి, తనను తాను ‘మరాఠీ’,  ‘హిందువు’ అని చెప్పుకుంటూ..  మనం భాష గుర్తింపుల కంటే హిందుత్వానికే ప్రాధాన్యత ఇవ్వాలి” అని ఆ వీడియోలో బాల్​ థాక్రే పేర్కొన్నారు. 

ఈ వీడియోను షేర్​ చేస్తూ పలువురు బీజేపీ నేతలు.. తండ్రి సిద్ధాంతాలకు భిన్నంగా కొడుకులు భాషా రాజకీయాలు చేస్తున్నారంటూ ఉద్ధవ్ థాక్రే, రాజ్​ థాక్రేను విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రైమరీ స్కూల్స్​లో హిందీ భాషను తప్పనిసరి చేస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడాన్ని ‘విజయంగా’ అభివర్ణిస్తూ ఇటీవల ముంబైలో ఉద్ధవ్, రాజ్ కలిసి ఓ సభను ఏర్పాటు చేశారు.

 రాబోయే ముంబై నగర పాలక సంస్థ (సివిక్ బాడీ) ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఉద్ధవ్ థాక్రే  ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం హిందీని ప్రజలపై రుద్దడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని వారు స్పష్టం చేశారు. అప్పటినుంచీ వారిపై సోషల్​ మీడియాలో ట్రోలింగ్​ మొదలైంది.