షిండే వర్గానిదే శివసేన.. ఈసీ స్పష్టం

షిండే వర్గానిదే శివసేన.. ఈసీ స్పష్టం

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే వర్గానికి భారత ఎన్నికల సంఘం బిగ్ షాకిచ్చింది. సీఎం ఏకనాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేన  పార్టీ అని  వెల్లడించింది. షిండే వర్గానికే  విల్లు, బాణం గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.  ప్రస్తుత శివసేన రాజ్యాంగం అప్రజాస్వామికమని ఈసీ  పేర్కొంది. ఎలాంటి ఎన్నికలు లేకుండా ప్రజాస్వామికంగా కోటరీకి చెందిన వ్యక్తులను ఆఫీస్ బేరర్లుగా నియమించడం సరికాదని అభిప్రాయపడింది. అటువంటి పార్టీ నిర్మాణాలు విశ్వాసాన్ని ప్రేరేపించడంలో విఫలమవుతాయని పేర్కొంది. 2018లో శివసేన పార్టీ రాజ్యాంగాన్ని ఎన్నికల కమిషన్ కు ఇవ్వలేదు. 1999లో అప్పటి శివసేన చీఫ్ బాలా సాహెబ్ ఠాక్రే తీసుకువచ్చిన రాజ్యాంగం ప్రజాస్వామ్య విలువలను ఉల్లంఘిస్తున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. 

 

అసెంబ్లీలో మొత్తం 67 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేల మద్దతు షిండే వర్గానికి ఉంది. పార్లమెంటులో షిండే వర్గానికి చెందిన 13 మంది, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 7 మంది ఎంపీలు ఉన్నారు. దీని ఆధారంగానే ఎన్నికల సంఘం షిండే వర్గానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.  

ఉద్దవ్ థాక్రే కేబినెట్‌లో మంత్రిగా ఉన్న షిండే  తిరుగుబాటు చేయడంతో అప్పటివరకు అధికారంలో ఉన్న మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం బీజేపీతో కలిసి ఏకనాథ్ షిండే  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.   ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.