- నక్సల్స్ రహిత ప్రాంతంగా కర్రెగుట్టలు: డీజీపీ శివధర్‌రెడ్డి
- మావోయిస్టు సానుభూతి పరులపై నిఘా పెట్టాలి
- ఏజెన్సీ ప్రాంతాలు శాంతి నిలయాలుగా మారుతున్నాయి
- కర్రెగుట్టల్లో ఏరియల్ సర్వే, ఔట్ పోస్టుల సందర్శన
- పీసీసీఎఫ్ సువర్ణతో కలిసి వ్యూపాయింట్ ప్రారంభం
వెంకటాపురం, వెలుగు: తెలంగాణలో మావోయిస్టుల ఉనికి లేదని డీజీపీ శివధర్ రెడ్డి తేల్చిచెప్పారు. మంగళవారం ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్టల్లోని పామునూరు గ్రామంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్), హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ సి.సువర్ణతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా మావోయిస్టుల ప్రభావం వల్ల వెనకబడిన గిరిజన గ్రామాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయని చెప్పారు.
ఏజెన్సీ ప్రాంతాలు శాంతినిలయాలుగా మారుతున్నాయని అన్నారు. ఆపరేషన్ కగార్ విజయవంతం కావడంతో.. మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గిందన్నారు. ప్రస్తుతం వారి సంఖ్య ఆరుకు చేరిందని చెప్పారు. గతంలో నక్సల్స్ ప్రభావంతో పామునూర్, జెల్ల, తడపడ (కర్రెగుట్టలు) తదితర గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు.
తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు మావోయిస్ట్ ఫ్రీ జోన్ కావడంతో పామునూరు గ్రామం నుంచి మొరుమూరు గ్రామాల మధ్య 13 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయిందని.. ఇంకా 16 కిలోమీటర్ల మేర రోడ్డు వేయాల్సి ఉందని వివరించారు. వెంకటాపూర్ నుంచి చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ వరకు నిర్మిస్తున్న రోడ్డు త్వరలో పూర్తవుతుందన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్, పోలీస్ శాఖలు సమన్వయంతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు డీజీపీ తెలిపారు.
ఉన్నతాధికారులతో డీజీపీ రివ్యూ
కర్రెగుట్టల ఏరియల్సర్వే, పర్యటన అనంతరం వెంకటాపురం పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో డీజీపీ ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ మీటింగ్‌లో సరిహద్దుల భద్రత, గంజాయి తదితర అంశాలపై చర్చించారు. మావోయిస్టు సానుభూతిపరులపై నిఘా పెట్టాలని పోలీసు ఉన్నతాధికారులను డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశించారు.
చత్తీస్గడ్, ఒడిశా రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. కర్రెగుట్టల ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిఘా పెంచాలని సూచించారు. ఆదివాసీ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడంతోపాటు ఆర్థిక పరిపుష్టి సాధించాలంటే శాంతియుత వాతావరణం కొనసాగాలని ఆకాంక్షించారు. నిత్యం ఉన్నతస్థాయి పర్యవేక్షణ ఉంటుందని, ఎప్పటికప్పుడు స్థానికంగా జరుగుతున్న పరిణామాలపై నివేదికలు అందజేయాలని ఆదేశించారు.
కర్రెగుట్టల్లో టూరిజం అభివృద్ధి చేస్తం: సువర్ణ
తెలంగాణ చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలు దట్టమైన అడవులతో సహజ సిద్ధమైన జలపాతాలున్న సుందరమైన ప్రాంతమని పీసీసీఎఫ్ సువర్ణ అన్నారు. ఈ ప్రాంతాన్ని ఎకో–టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వేసవికాలంలో కార్చిచ్చు వ్యాపించడం వల్ల అడవులు కాలిపోయేవని, ఈ విషయం ఆఫీసర్లకు తెలిసినా మావోయిస్టుల కారణంగా ఆయా ప్రదేశాలకు వెళ్లలేక పోయేవారన్నారు. ప్రస్తుతం పరిస్థితి మారడంతో అడవులు రక్షించడానికి అంతర్గత రహదారులు నిర్మిస్తామని తెలిపారు. అనంతరం ఆమె, డీజీపీ కలిసి పామునూరు, మొరుమూరు గ్రామాల మధ్యలో ఉన్న గుట్టపై వాచ్ టవర్ (కర్రెగుట్టలు వ్యూ పాయింట్) నిర్మాణాన్ని ప్రారంభించారు.
ఏరియల్ సర్వే..
డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఉదయం 10.30కి హెలికాప్టర్ ద్వారా కర్రెగుట్టల్లోని పామునూరు బేస్ క్యాంప్ వద్దకు చేరుకున్నారు. సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించి అనంతరం ఇంటర్ ఏజెన్స్ కో-ఆర్డిషన్ సెంటర్ కు , పోలీస్ ఔట్ పోస్ట్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పామునురు గ్రామంలో నివసిస్తున్న ఏడు కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు, సోలార్ లైట్లు పంపిణీ చేశారు.
గ్రామం నుంచి వెంకటాపురం వరకు ప్రయాణించడానికి ఆటో, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి టూ వీలర్ పంపిణీ చేశారు. వెంకటాపురం మండల కేంద్రంలోని కాఫీడ్ స్వచ్ఛంద సంస్థ ప్రాంగణంలో ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సీఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్, ఏడీ ఇంటెలిజెన్స్ విజయకుమార్, ములుగు ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, డిస్ట్రిక్ ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
