ఇండియా.. ఇంటికే

ఇండియా.. ఇంటికే

క్రైస్ట్‌‌‌‌చర్చ్‌‌: ఐసీసీ విమెన్స్‌‌ వన్డే వరల్డ్‌‌కప్‌‌లో ఇండియాకు షాక్‌‌. అస్థిరమైన పెర్ఫామెన్స్‌‌తో నిరాశపరుస్తున్న టీమిండియా.. చావో రేవో మ్యాచ్‌‌లోనూ చేతులెత్తేసింది. సెమీస్‌‌ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌లో 3 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో.. స్మృతి మంధానా (71), మిథాలీ రాజ్‌‌ (68), షెఫాలీ వర్మ (53), హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ (48) బ్యాటింగ్‌‌లో రాణించడంతో.. టాస్‌‌ గెలిచిన ఇండియా 50 ఓవర్లలో 274/7 స్కోరు చేసింది. స్టార్టింగ్‌‌లో సఫారీ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. స్మృతి, షెఫాలీ ఫస్ట్‌‌ వికెట్‌‌కు 91 రన్స్‌‌ జోడించి శుభారంభాన్నిచ్చారు. యాస్తికా భాటియా (2) విఫలమైనా, మిడిలార్డర్‌‌లో మిథాలీ రెండు కీలక భాగస్వామ్యాలతో ఆకట్టుకుంది. స్మృతితో కలిసి మూడో వికెట్‌‌కు 80, హర్మన్‌‌తో నాలుగో వికెట్‌‌కు 58 రన్స్‌‌ జోడించింది.  లోయర్‌‌ ఆర్డర్‌‌లో పూజా వస్త్రాకర్‌‌ (3), రిచా ఘోష్‌‌ (8), స్నేహ్‌‌ రాణా (1 నాటౌట్‌‌), దీప్తి శర్మ (2 నాటౌట్‌‌) పెద్దగా రాణించకపోయినా ఇండియా మంచి టార్గెట్‌‌నే నిర్దేశించింది. సఫారీ బౌలర్లలో ఇస్మాయిల్‌‌, క్లాస్‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. 

వోల్వర్ట్‌‌ జోరు..

టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 275/7 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్లలో లాజెల్లి లీ (6) విఫలమైనా, లౌరా వోల్వర్ట్‌‌ (80) దీటుగా ఆడింది. లారా గుడాల్‌‌ (49)తో సెకండ్‌‌ వికెట్‌‌కు 125 రన్స్‌‌ జోడించింది. డుప్రీజ్‌‌ (52), కాప్‌‌ (32), సునే లుస్‌‌ (22) అండగా నిలిచారు. లాస్ట్‌‌ ఓవర్‌‌లో కాస్త ఉత్కంఠ వచ్చినా.. ఇండియా బౌలర్లు అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. సౌతాఫ్రికా గెలవాలంటే ఆఖరి ఓవర్‌‌లో 7 రన్స్‌‌ కావాల్సిన దశలో, దీప్తి శర్మ అనవసరమైన నో బాల్‌‌ వేసి కొంప ముంచింది. సెకండ్‌‌ బాల్‌‌కే త్రిషా చెట్టి (7) వికెట్‌‌ తీసిన దీప్తి.. ఐదో బంతిని.. నో బాల్‌‌గా వేసింది. దీంతో విజయ సమీకరణం రెండు బాల్స్‌‌లో రెండు రన్స్‌‌గా మారింది. ఈ ఈక్వేషన్‌‌ను డుప్రిజ్‌‌, ఇస్మాయిల్‌‌(2 నాటౌట్‌‌) ఈజీగా ఛేదించారు. రాజేశ్వరి, హర్మన్‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. డు ప్రిజ్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.