బావను కిడ్నాప్ చేసిన బామ్మర్దులు.. అందరూ చూస్తుండగానే బైక్ పై...

బావను కిడ్నాప్ చేసిన బామ్మర్దులు.. అందరూ చూస్తుండగానే బైక్ పై...
  • స్థానికుల సమాచారంతో పోలీసులు అలర్ట్​
  • చివరికి కథ సుఖాంతం

అబిడ్స్, వెలుగు: ఎల్బీ స్టేడియం సమీపంలోని ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద గురువారం బావను బామ్మర్దులు కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే బైక్‌‌పై బలవంతంగా ఎత్తుకెళ్లడంతో స్థానికులు వెంటనే అబిడ్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నాలుగు గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టి బాధితుడిని గుర్తించి ఘటనకు తెరదించారు. గురువారం ఉదయం ఛాపెల్ రోడ్‌‌లోని ఓమ్ని హాస్పిటల్ నుంచి ఓ వ్యక్తి బైక్‌‌పై బయలుదేరాడు. అతని వెనుక ఇద్దరు వ్యక్తులు బైక్‌‌లపై వెంబడిస్తూ వచ్చి ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద అతడిని అడ్డుకున్నారు. 

ఆ వ్యక్తిని బలవంతంగా బైక్‌‌పై ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ సమయంలో బాధితుడు “నన్ను వదలండి..  నేను ఎక్కడికీ రాను.. కాపాడండి” అంటూ అరవడం స్థానికులు విన్నారు. వెంటనే 100 నంబర్‌‌కు సమాచారం ఇవ్వడంతో అబిడ్స్ పోలీసులు అక్కడికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. 

బైక్ నంబర్‌‌ను గుర్తించి నిందితులను సంప్రదించారు. వారిని ప్రశ్నించగా కుటుంబంలో చిన్నపాటి గొడవల కారణంగా తమ బావను బలవంతంగా తీసుకువచ్చామని తెలిపారు. కుటుంబ సమస్యలు ఉంటే పబ్లిక్‌‌గా కిడ్నాప్ చేయడం ఏమిటని ప్రశ్నించిన సీఐ పరశురామ్ వెంటనే బాధితుడిని పోలీస్ స్టేషన్‌‌కు తీసుకురావాలని ఆదేశించారు. దీంతో ఘటన సుఖాంతమైంది.