జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 నుంచి.. ప్రశాంతిహిల్స్ కాలనీ వైపు అర్ధరాత్రి నడిచి వెళ్తుంటే..

జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 నుంచి.. ప్రశాంతిహిల్స్ కాలనీ వైపు అర్ధరాత్రి నడిచి వెళ్తుంటే..

గచ్చిబౌలి, వెలుగు: అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై నలుగురు యువకులు కర్రలతో దాడి చేసి అతడి వద్ద ఉన్న సెల్​ఫోన్, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్​స్టేషన్​పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ కేసు వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ర్టం మధుబనీ ప్రాంతానికి చెందిన సౌరభ్​కుమార్(24) కుటుంబంతో కలిసి నగరానికి వచ్చి రాయదుర్గం ప్రశాంత్​నగర్​కాలనీలో నివాసం ఉంటున్నారు. సౌరభ్​కుమార్ స్థానికంగా సీసీటీవీ టెక్నీషియన్​గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

టోలీచౌకి హకీంపేట్​లో నివాసం ఉండే మహ్మద్​రేహన్(19), ఇబ్రహీం అహ్మద్​(19)తోపాటు మరో ఇద్దరు మైనర్​బాలురు అర్ధరాత్రి బైక్లపై తిరుగుతున్న దారి దోపీడీ చేయాలని ప్లాన్​చేసుకున్నారు. ఈనెల 10న అర్ధరాత్రి  సౌరభ్​కుమర్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 నుంచి ప్రశాంతిహిల్స్​కాలనీ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదే సమయంలో రేహన్, ఇబ్రహీం అహ్మద్​మరో ఇద్దరు మైనర్లు కలిసి రెండు బైక్స్​పై అటువైపు వెళ్తున్నారు. సౌరభ్​కుమార్ చూసి​బైక్ ఆపి లిఫ్ట్​ఇస్తామని చెప్పడంతో అతడు ఎక్కాడు. కొద్దిదూరం వెళ్లాక సౌరభ్​వద్ద ఉన్న సెల్​ఫోన్, డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించాడు. దీంతో సౌరభ్​వారి బైక్​దిగి వారితో వాగ్వాదానికి దిగాడు. రోడ్డు వెంట వెళ్తున్న వారు రావడంతో నలుగురు యువకులు అక్కడి నుంచి పారిపోయారు.

కొద్దిదూరం వెళ్లాక.. నలుగురు కలిసి మార్గమధ్యంలో సౌరభ్​ను అడ్డుకొని కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. అనంతరం అతని వద్ద నుంచి సెల్​ఫోన్, డబ్బులు లాక్కొని పారిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న సౌరభ్​ను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకొని సౌరభ్​ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

అయితే సౌరభ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దాడి విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సౌరభ్ ఈనెల 13న మృతి చెందాడు. సీసీ కెమెరాల ఆధారంగా రేహన్, ఇబ్రహీం అహ్మద్​లను పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. మరో ఇద్దరు మైనర్​ బాలురను జువైనల్ హోంకు తరలించారు.