
హైదరాబాద్: బాచుపల్లిలో షాకింగ్ ఘటన జరిగింది. సూట్ కేసులో మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు కంగుతిన్నారు. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని, రెడ్డీస్ ల్యాబ్ గోడ పక్కన గల నిర్మానుష్య ప్రాంతంలో సూట్ కేస్ నుంచి దుర్వాసన వస్తుందని బాచుపల్లి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా బ్యాగులో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉంది. ఆమె వయసు దాదాపు 25 నుంచి 35 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు తెలిపారు.
చనిపోయిన మహిళ మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్ ధరించి ఉందని పోలీసులు చెప్పారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలుగా ఏర్పడి మృతురాలు ఎవరు, ఏంటని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆచూకీతో పాటు హత్య చేసిన వారి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతుందని బాలానగర్ డీసీపీ తెలిపారు. చనిపోయిన మహిళ ఆచూకీ తెలిసినవారు బాచుపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి వివరాలు తెలియపరచగలరని పోలీసులు కోరారు. బాచుపల్లి, కూకట్ పల్లి పరిధిలో ఇటీవల హత్యలు పెరిగిపోతుండటంతో ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికులు భయంతో వణికిపోతున్నారు. మే 11న హైదరాబాద్లోని కూకట్ పల్లిలో దారుణ హత్య జరిగిన సంగతి తెలిసిందే.
ఓ గ్యాంగ్ గంజాయి మత్తులో యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన కూకట్ పల్లిలో వెలుగుచూసింది. ఆదివారం ( మే 11 ) రాత్రి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్లోని ఓ అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న పార్కులో గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులు వెంకటరమణ అనే యువకుడిని ఐరన్ రాడ్డుతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్డుతో గుండెల్లో గుచ్చగా తీవ్రంగా గాయపడ్డ వెంకటరమణ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిందితులు పార్కులో గంజాయి సేవిస్తుండగా.. అపార్టుమెంట్ వాచ్ మెన్‌తో పాటు వెంకటరమణ అనే యువకుడు తన మిత్రులతో కలిసి వారిని నిలదీయగా... ఆగ్రహానికి గురైన పవన్ అనే యువకుడు తన చేతిలో ఉన్న ఇనుప కడ్డీతో వెంకటరమణ గుండెల్లో గుచ్చాడు. ఈ ఘటనలో వెంకటరమణ తీవ్రంగా గాయపడటంతో చనిపోయాడు.