పారాలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించిన భారత అథ్లెట్

పారాలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించిన భారత అథ్లెట్

టోక్యో: పారాలింపిక్స్ లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన అవని.. తాజాగా కాంస్యం గెలుచుకుంది. దాంతో టోక్యో పారాలింపిక్స్ లో అవని రెండో మెడల్ సాధించినట్లయింది. ఆగష్టు 30న 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ దక్కించుకున్న అవనీ.. శుక్రవారం 50 మీటర్ల రైఫిల్ విభాగంలో కాంస్యం గెలుపొందింది. ఇప్పటివరకూ టోక్యో పారాలింపిక్స్ లో భారత్ 12 మెడల్స్ తన ఖాతాలో వేసుకుంది. పారాలింపింక్స్-2020లో రెండు మెడల్స్ గెలిచిన ఏకైక ఇండియన్ గా అవని నిలిచింది. పారాలింపిక్స్ లో భారత్ 1968 నుంచి 2016 వరకు 53 ఏండ్లలో కేవలం 12 మెడల్స్ సాధిస్తే.. ఒక్క 2020 పారాలింపిక్స్ లోనే 12 మెడల్స్ సాధించడం విశేషం.

రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన 19 ఏళ్ల అవని.. తన 11 ఏండ్ల వయసులో 2012లో జరిగిన ఓ కారు ప్రమాదంలో కాలును కోల్పోయింది. ఆ తర్వాత ఆమెను తండ్రి ఆటల వైపు ప్రోత్సహించాడు. దాంతో ఆమె మొదట ఆర్చరీ వైపు వెళ్లింది. కానీ, ఆ తర్వాత షూటింగుపై తనకున్న ఇష్టంతో అటువైపు మళ్లింది. కోచ్ సుమ శిరూర్ ప్రోత్సాహంతో రైఫిల్ లో శిక్షణ ప్రారంభించి.. పారాలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించి అందరిని ఆకర్షించింది.