- ఈవీ కారు పేలి 8 మంది మృతి ..
- చార్జింగ్ పాయింట్లో షార్ట్ సర్క్యూట్తో కారుకు మంటలు
- పేలిన ఇంట్లోని గ్యాస్ సిలిండర్లు
- స్ట్రక్ అయిన బిల్డింగ్‌లోని ఎలక్ట్రానిక్ లాక్ సిస్టమ్
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ బిల్డింగ్ ముందు చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ కారు పేలడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాసేపట్లోనే మంటలు మూడంతస్తుల బిల్డింగ్‌కు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఒకే ఫ్యామిలీకి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇండోర్: బిల్డింగ్ ముందు చార్జింజ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కారు పేలడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కొద్ది సెకన్లలోనే ఆ మంటలు వ్యాపించి మూడంతస్తుల బిల్డింగ్‌కు అంటుకున్నాయి. దీంతో ఆ బంగ్లాలో ఉన్న 10 సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. పేలుడు ధాటికి మంటలు మరింత వ్యాపించి ఆ ఇంట్లో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులున్నారు. బుధవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ పెను విషాదం చోటుచేసుకుంది.
కొంప ముంచిన ఎలక్ట్రానిక్ లాక్ సిస్టమ్
బ్రిజేశ్వరి అనెక్స్ కాలనీలోని తమ ఇంటి ముందు కుటుంబ సభ్యులు ఈవీ కారును చార్జింగ్‌లో పెట్టారు. రాత్రంతా అలాగే వదిలేయడంతో తెల్లవారుజామున చార్జింగ్ పాయింట్‌లో షార్ట్‌సర్క్యూట్ జరిగి కారుకు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే ఆ మంటలు ఇంటి మొత్తాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఇంట్లో నిల్వ ఉంచుకున్న సిలిండర్లు పేలి మంటలు మరింత తీవ్రం అయ్యాయి. కరెంటు వైర్లకు నిప్పంటుకోవడంతో ఇంట్లో అమర్చిన ఎలక్ట్రానిక్ డోర్ లాకింగ్ సిస్టమ్ ఆ సమయంలో పనిచేయకుండాపోయింది.
అప్పటికే కమ్ముకున్న పొగను గమనించిన ఇంట్లోవాళ్లు బయటికి వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు మంటలు అదుపు చేసి, డోర్లు పగలగొట్టి చూసేసరికి అందరూ ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 8 మంది మృతదేహాలను ఆస్పత్రికి తరలించామని, మరో ఫ్లోర్‌లో ఉన్న ముగ్గురిని కాపాడామని పోలీసులు తెలిపారు.
ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం
ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యకం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు. ఇది అత్యంత హృదయ విదారక ఘటన అంటూ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్.. ఈవీల చార్జింగ్‌కు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని ఆర్డర్స్ ఇచ్చారు.
