ఢిల్లీలో షార్ట్ సర్క్యూట్తో .. ఇంట్లో మంటలు.. 9 మంది సజీవదహనం

ఢిల్లీలో షార్ట్ సర్క్యూట్తో .. ఇంట్లో మంటలు.. 9 మంది సజీవదహనం
  • పాలం ఏరియాలో ఘోరం.. మృతులంతా ఒకే ఫ్యామిలీ
  • రెండేండ్ల బిడ్డతో మూడో ఫ్లోర్‌‌‌‌  నుంచి దూకిన తండ్రి

న్యూఢిల్లీ: షార్ట్‌‌ సర్క్యూట్‌‌తో మంటలు అంటుకోవడంతో ఢిల్లీలోని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ముగ్గురు చిన్నారులు  ఉన్నారని అధికారులు తెలిపారు. పాలం ప్రాంతంలోని నాలుగు అంతస్తుల రెసిడెన్షియల్‌‌ కాంప్లెక్స్‌‌లో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. మంటలు అంటుకోవడం చూసి చుట్టుపక్కలవాళ్లు సమాచారం ఇవ్వగా 30 ఫైర్‌‌‌‌ ఇంజన్లు, 11 అంబులెన్స్‌‌లతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్‌‌ బృందాలు, ఫైర్‌‌‌‌ సిబ్బంది రంగంలోకి దిగారు. మూడు గంటలపాటు శ్రమించి మంటలు అదుపుచేసి, రెస్క్యూ చేపట్టారు.  

అగ్నికి ఆహుతైన మూడు తరాలు

వ్యాపారి రాజేందర్‌‌‌‌ కశ్యప్‌‌.. పాలంలోని శ్రీరామ్‌‌ చౌక్‌‌ వద్ద నాలుగు అంతస్తుల కాంప్లెక్స్‌‌లో నివాసం ఉంటున్నారు. గ్రౌండ్‌‌, ఫస్ట్‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌లో బట్టల షాపు‌‌, గోడౌన్‌‌, కాస్మెటిక్‌‌ దుకాణాలు నడిపిస్తూ రెండు, మూడు అంతస్తుల్లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. బుధవారం ఉదయం గ్రౌండ్‌‌ ఫ్లోర్‌‌‌‌లో మంటలు ఎగిసిపడి నిమిషాల్లోనే బిల్డింగ్ అంతటా వ్యాపించాయి. 

ఇంట్లో నిద్రిస్తున్న కశ్యప్‌‌ భార్య లాడో(70), కొడుకులు కమల్‌‌(39), ప్రవేశ్‌‌(33), కోడళ్లు ఆశు(35), దీపిక(28), బిడ్డ హిమాన్షి(22)తోపాటు 15, 6, 3 ఏండ్ల వయసున్న మనవరాళ్లు చనిపోయారు. మంటలు, దట్టమైన పొగ బిల్డింగ్‌‌ను కమ్మేయడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. కశ్యప్‌‌ మూడో కొడుకు అనిల్‌‌ తన రెండేండ్ల బిడ్డతో పాటు మూడో అంతస్తు నుంచి కిందకు దూకి తీవ్రగాయాలతో బయటపడ్డాడు. 

కశ్యప్‌‌ నాలుగో కొడుకు మరో బిల్డింగ్‌‌లోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. కాగా, ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ 2 లక్షలు, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా10 లక్షల చొప్పున ఎక్స్‌‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సోనియా గాంధీ, రాహుల్‌‌, ప్రియాంకా గాంధీ సానుభూతి తెలిపారు.