దేశ బడ్జెట్​లో 15% విద్యకు కేటాయించాలి: తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ

దేశ బడ్జెట్​లో 15% విద్యకు కేటాయించాలి: తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ

ముషీరాబాద్, వెలుగు:  కార్పొరేట్ సంస్థల ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తెచ్చిందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ విమర్శించింది. చరిత్రను వక్రీకరించడం ఆపాలని, దేశ బడ్జెట్​లో 15 శాతం విద్యకు కేటాయించాలని డిమాండ్ చేసింది. బుధవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పీపుల్స్ మేనిఫెస్టోలోని విద్యారంగ డిమాండ్లను రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్​సంస్థలకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి, మత విద్యను ప్రోత్సహిస్తోందన్నారు. 

 నూతన విద్యా విధానం 2020, జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్​వర్క్ 2023ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్​యూనివర్సిటీలను బలోపేతం చేయాలని కోరారు. ఫారిన్​యూనివర్సిటీలను అనుమతించకూడదన్నారు. కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య అందించాలని, ఉమ్మడి విద్యా వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో అలహాబాద్ హైకోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు. ప్రతి యూనివర్సిటీ, కాలేజీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరపాలన్నారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ, మహేశ్, అల్లూరి విజయ్, గడ్డం శ్యామ్, శ్రీను, గౌతమ్, సోమయ్య, ప్రకాష్, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.

ALSO READ ; ఎలక్టోరల్ బాండ్స్ అతిపెద్ద కుంభకోణం: ఆప్