
గజ్వేల్/సంగారెడ్డి టౌన్, వెలుగు: గ్రామాల్లోని రైతు వేదికల్లో లాభసాటి వ్యవసాయంపై ఏడాది పొడవునా రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. రైతులు సంప్రదాయ సాగుకు స్వస్తి పలకాలని సూచించారు. ప్రస్తుతం పంట మార్పిడి అనివార్యమైందని, విభిన్న పంటలపై దృష్టి సారించాలని చెప్పారు. మంగళవారం సిద్దిపేట, మెదక్ జిల్లాలకు సంబంధించిన వానాకాలం సాగు సన్నాహక సమావేశాన్ని గజ్వేల్‌లోని ఆడిటోరియంలో నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సమావేశాన్ని మల్కాపూర్‌లోని ఫంక్షన్హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రావుతో కలిసి మంత్రి నిరంజన్ పాల్గొని మాట్లాడారు. ఆయిల్ పామ్‌కు ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని రైతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో రూ.300కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మిస్తునట్లు గుర్తుచేశారు. ఉపాధి స్కీంను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని కోరుతున్నా పీఎం మోడీ పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వ్యవసాయ పనులకు పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల నుంచి కూలీలు వలస వస్తున్నారని చెప్పారు. సర్కారీ నౌకరికి ఉన్నంత క్రేజ్ వ్యవసాయదారులకు ఉందని, సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో సమానంగా కొందరురైతులు ఆదాయం పొందుతున్నారన్నారు. సిద్దిపేట జిల్లాలో 30 వేల ఎకరాల్లో ఆయిల్‌ఫాం సాగుకు ప్లాన్చేసినట్లు చెప్పారు. మెదక్ జిల్లాలో సెరి కల్చర్ ఫాంను పెంచడానికి రూ.3 లక్షల సబ్సిడీ ఇస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గాలి మోటార్లలో వచ్చి గాలి మాటలు
దుబ్బాక: రోడ్డెంట పోతే రైతులు అడ్డుకుంటారేమోనన్న భయానికి రాష్ట్ర మంత్రులు గాలి మోటార్లలో వచ్చి గాలి మాటలు చెప్పి పోతున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం దుబ్బాకలో ఆయన మాట్లాడారు. వ్యవసాయంపై అవగాహన సదస్సుకు మంత్రి నిరంజన్‌రెడ్డి హెలిక్యాప్టర్‌లో రావడం విడ్డూరంగా ఉందన్నారు. రోడ్డు మీద వస్తే ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు గాస్తున్న రైతుల దీనస్థితి మంత్రికి తెలిసేదని, ఇవేం పట్టించుకోకుండా గాల్లో వచ్చి గాలి మాటలు చెప్పి గాల్లోనే పోతున్నారని విమర్శించారు.