ఆడబిడ్డ పార్టీకి అధ్యక్షురాలిగా ఉండకూడదా..? : జీవన్ రెడ్డి

ఆడబిడ్డ పార్టీకి అధ్యక్షురాలిగా ఉండకూడదా..? : జీవన్ రెడ్డి

24 గంటలు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ ఒక్కటి చూపించినా కేసీఆర్ కు క్షీరాభిషేకం చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. వైఎస్ విగ్రహం ధ్వంసం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఎస్ చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కొనసాగింపు మాత్రమేనని ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్యయుతంగా యాత్రలు చేపడితే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ఏమిటి..? అని ప్రశ్నించారు. అధికార పార్టీ దాడులు చేస్తుంటే పోలీసులు నిచ్చేష్టులై చూడడం అందరూ ఖండించాలన్నారు. విమర్శలు చేస్తే చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి కానీ దాడులు చేయడం ఇదేం సంస్కృతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్న జీవన్ రెడ్డి...  వైఎస్ విగ్రహం పునః ప్రతిష్టింపజేయడం ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు.

ఆడబిడ్డని కూడా చూడకుండా దాడి చేయడం, యాత్రను అడ్డుకోవడం ఏమిటి..? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. అనుమతి పొందిన యాత్రకు పోలీసులు భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత అని, వైఎస్ పై అభిమానంతో విగ్రహాన్ని  ఏర్పాటు చేసుకుంటే ద్వంసం చేయడం ఇదేం ప్రజాస్వామ్య విధానమని ఫైర్ అయ్యారు. ఆడబిడ్డ పార్టీకి అధ్యక్షురాలిగా ఉండకూడదా... భూర్జువ మనస్తత్వంతో మీకు మాత్రమే పాలించే అర్హత ఉందా అని నిలదీశారు. వైఎస్ విగ్రహం ధ్వంసం చేయడం, రైతులు, మహిళలు, విద్యార్థులు మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. 

ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వైఎస్ దేనన్న జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ రైతుల్లో ఆత్మస్థైర్యం కల్పించారని, తెలంగాణలో రీయింబర్స్మెంట్ తో విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. ఆరోగ్యశ్రీ అమలు చేసిన ఘనత వైఎస్ దేనని కొనియాడారు. మహిళా సంఘాలకు పావలా వడ్డీకి రుణం ఇచ్చారన్నారు. 
సిలిండర్ ధర పెరిగితే మహిళలపై భారం పడొద్దని అదనపు భారం భరించారని తెలిపారు. అర్హత ప్రాతిపదికన ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లులు ఇచ్చారని, కానీ కేసీఆర్ పాలనలో ఎక్కడా డబుల్ బెడ్రూం కనపడతలేదని ఆరోపించారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారన్నారు.