ఒరిజినల్ ఆధార్ చూపించాలి.. జిరాక్స్ కాదు : ఫ్రీ జర్నీపై ఆర్టీసీ

ఒరిజినల్ ఆధార్ చూపించాలి.. జిరాక్స్ కాదు : ఫ్రీ జర్నీపై ఆర్టీసీ

టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులు తమ నకలు లేదా జిరాక్స్ కాపీలు కాకుండా ఒరిజినల్‌ గుర్తింపు పత్రాలు చూపించాలని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ ఆదేశించారు. ఒరిజినల్ గుర్తింపు కార్డులను చూపించాలని పదేపదే చెబుతున్నప్పటికీ కొంతమంది తమ స్మార్ట్ ఫోన్‌ల ఫొటోకాపీలు, కలర్ జిరాక్స్‌లను చూపిస్తున్నారని యాజమాన్యం దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని, ప్రయాణ సమయం కూడా పెరుగుతోందని ఎక్స్‌లో రాసుకొచ్చారు. మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని తెలంగాణ మహిళలకు వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల మహిళలు మాత్రం డబ్బు చెల్లించి విధిగా టికెట్ తీసుకుని, తమకు సహకరించాలని కోరారు.

అడ్రస్ ప్రూఫ్ లేని పాన్ కార్డును ఉచిత ప్రయాణానికి ఉపయోగించలేరని సజ్జనార్ పేర్కొన్నారు. ఐడీ కార్డ్‌లో ప్రయాణికుల స్పష్టమైన ఫొటో, వారి చిరునామా రుజువు ఉండాలని కూడా చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు ఈ పథకానికి వర్తిస్తుందన్న ఆయన.. పాన్ కార్డుకు చిరునామా లేనందున ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని ఎక్స్‌లో తెలిపారు. జీరో టిక్కెట్‌ను జారీ చేయడం ప్రాముఖ్యతపై స్పందించిన ఆయన.. జారీ చేసిన జీరో టిక్కెట్ల సంఖ్య ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఆర్‌టీసీకి డబ్బు ఇస్తుందని చెప్పారు.

మహిళలు జీరో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే సంస్థకు నష్టమని, కావున ప్రతి మహిళ కూడా జీరో టికెట్ తీసుకోవాలని సజ్జనార్ సూచించారు. టిక్కెట్టు తీసుకోకుండా ప్రయాణిస్తే.. చెకింగ్‌లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగానికే ప్రమాద వస్తుందని.. జీరో టికెట్‌ తీసుకోవడానికి నిరాకరిస్తే రూ.500 జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.