
నేడు సోమవారం ఆగస్టు 25న సుప్రీంకోర్టు ఆన్‌లైన్ కంటెంట్, స్టాండ్-అప్ కామెడీ షోలలో వికలాంగులను అవమానించిన యూట్యూబర్లు, హాస్యనటులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి తప్పు మళ్లీ జరిగితే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ఇండియాస్ గాట్ లాటెంట్లో యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా చేసిన అనుచితమైన జోకుల నేపథ్యంలో ఈ తీర్పు వచ్చింది.
సుప్రీంకోర్టు ఆగ్రహం: ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా అలాగే హాస్యనటులు సమయ్ రైనా, విపున్ గోయల్, బల్రాజ్ పరంజీత్ సింగ్ ఘాయ్, సోనాలి ఠక్కర్, నిశాంత్ జగదీష్ తన్వర్ వీరందరి పై SMA క్యూర్ ఫౌండేషన్ ఒక పిటిషన్ వేసింది. అందులో వీరు వికలాంగుల పై అనుచితమైన జోకులు వేశారని పిటిషన్‌లో ఆరోపించారు.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం హాస్యనటులను ఉద్దేశించి మీరు కోర్టులో క్షమాపణ చెప్పారు. అదే క్షమాపణను మీ సోషల్ మీడియాలో కూడా చెప్పండి అని ఆదేశించింది. దీనికి వారి తరపున హాజరైన న్యాయవాది కోర్టులో బేషరతుగా క్షమాపణ చెబుతున్నామని, అలాగే సోషల్ మీడియాలో కూడా క్షమాపణ చెబుతామని హామీ ఇచ్చారు.
జస్టిస్ బాగ్చి మాట్లాడుతూ హాస్యం అనేది జీవితంలో ఒక భాగం. మనం మనల్ని చూసి నవ్వుకోవాలి. కానీ, మనం ఇతరులను చూసి నవ్వుతూ వారి మనోభావాలను దెబ్బతీస్తే, అది సమస్యగా మారుతుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బుల కోసం మాట్లాడేస్తున్నారు. కానీ కొంతమంది ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి సమాజాన్ని ఉపయోగించుకోకూడదు. ఇది కేవలం వాక్ స్వాతంత్రం కాదు, డబ్బుల కోసం చేసే ప్రసంగం అని అన్నారు.
మార్గదర్శకాలను రూపొందించాలని చెప్పిన కోర్టు: క్షమాపణలు చెప్పడంతో పాటు వికలాంగులు ఇంకా ఇతర వికలాంగ వర్గాలకు గౌరవం, రక్షణ కల్పించడానికి సోషల్ మీడియాలో ఉపయోగించే భాష కోసం మార్గదర్శకాలను రూపొందించాలని సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖను కోర్ట్ ఆదేశించింది. మార్గదర్శకాలను సిద్ధం చేసేటప్పుడు వికలాంగుల సంక్షేమం కోసం జాతీయ బోర్డు (NBDSA), సంబంధితులని కూడా సంప్రదించాలని మంత్రిత్వ శాఖను కోరింది.
క్షమాపణలను యూట్యూబ్ ఛానెల్స్, పాడ్‌కాస్ట్స్ ఇతర సోషల్ మీడియా మాధ్యమంలో కూడా చెప్పాలని కోర్టు తెలిపింది. అలాగే మరోసారి ఇలాంటి తప్పు చేస్తే ఎంత జరిమానా విధించాలో కూడా చెప్పండి అని వెల్లడించింది.