సొంతగడ్డపై జరగనున్న 2026 టీ20 వరల్డ్ కప్ కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కు చోటు దక్కలేదు. టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉండడానికి అయ్యర్ అన్ని విధాలుగా అర్హుడైనప్పటికీ ఈ ముంబై బ్యాటర్ ను సెలక్టర్లు పట్టించుకోలేదు. మిడిల్ ఆర్డర్ లో ఆడే అయ్యర్ కు ఎక్కడా స్థానం లేదు. తిలక్ వర్మ జట్టులో పాతుకుపోయాడు. మరోవైపు హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, అక్షర్ పటేల్ రూపంలో జట్టులో ఆల్ రౌండర్లు నిండిపోయారు. 2025 ఐపీఎల్ సీజన్ లో అత్యద్భుతంగా ఆడినప్పటికీ అయ్యర్ కు దురదృష్టవశాత్తు స్క్వాడ్ లో చోటు దక్కలేదు.
ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్ జరగనుంది. అంతకంటే ముందు ఇండియా స్వదేశంలో న్యూజిలాండ్ తో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. భారత టీ20 జట్టులో ఉన్న తిలక్ వర్మకు విజయ్ హజారే ట్రోఫీలో గాయం కావడంతో ఆ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే శ్రేయాస్ కేవలం న్యూజిలాండ్ తో జరగబోయే తొలి మూడు టీ20 సిరీస్ కు మాత్రమే ఎంపికయ్యాడు. వరల్డ్ కప్ ఆడే అవకాశాలు లేవు. ఎందుకంటే వరల్డ్ కప్ లోపు తిలక్ వర్మ పూర్తి ఫిట్ నెస్ సాధించే అవకాశాలున్నాయి. ఒకవేళ తిలక్ కోలుకుంటే తిరిగి భారత జట్టులోకి వస్తాడు.
తిలక్ టీమిండియాలో చేరితే శ్రేయాస్ అయ్యర్ పై మరోసారి వేటు పడడం గ్యారంటీ. వరల్డ్ కప్ స్క్వాడ్ లో లేకపోవడంతో శ్రేయాస్ అయ్యర్ కు న్యూజిలాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ లో స్థానం దక్కే ఛాన్స్ లేదు. ఎందుకంటే శ్రేయాస్ కేవలం న్యూజిలాండ్ టీ20 సిరీస్ కు మాత్రమే ఎంపికయ్యాడు. ఈ కారణంగా గాయపడిన తిలక్ వర్మ స్థానంలో జట్టులో వచ్చిన అయ్యర్ కు ప్లేయింగ్ 11లో చోటు దక్కే అవకాశాలు లేవు. ఒకవేళ తుది జట్టులో అవకాశం వచ్చి అయ్యర్ సెంచరీ కొట్టినా.. తిలక్ వర్మ పూర్తి ఫిట్ నెస్ సాధిస్తే జట్టు శ్రేయాస్ ను రిలీజ్ చేస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత భారత టీ20 జట్టులో స్థానం సంపాదించిన అయ్యర్ పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా ఉంది.
