
లార్డ్స్ టెస్టులో టీమిండియా ఓటమి తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. మ్యాచ్ మొత్తం మనోళ్లే ఆధిపత్యం చూపించినా ఇంగ్లాండ్ ఒక్క సెషన్ లో తమ బౌలింగ్ తో ఫలితాన్ని మార్చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను 192 పరుగులకే ఆలౌట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు టీమిండియా విజయాన్ని ఖాయమనుకున్నారు. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయలేక 170 పరుగులకే మన జట్టు ఆలౌట్ అయింది. మరోవైపు చివరి రోజు అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఛేజింగ్ ను పక్కన పెడితే మన జట్టు మ్యాచ్ ఎక్కడ ఓడిపోయిందో గిల్ తో పాటు ప్రత్యర్థి కెప్టెన్ ఒకటే మాట చెప్పారు.
మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో గిల్ మాట్లాడుతూ.. తొలి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ రనౌట్ అవ్వడం ఓటమికి కారణమైందని గిల్ అన్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ సైతం పంత్ రనౌట్ ఈ మ్యాచ్ కు చాలా పెద్ద తేడా అని చెప్పాడు. మూడో రోజు ఆటలో భాగంగా రాహుల్, పంత్ భాగస్వామ్యంతో భారత్ కు ఒకదశలో ఆధిక్యం ఖాయమనిపించింది. ఈ సమయంలో మూడో రోజు లంచ్ కు ముందు చివరి ఓవర్ లో రనౌట్ రూపంలో పంత్ ఔట్ కావడం తీవ్ర నిరాశకు గురి చేస్తుంది.
బషీర్ బౌలింగ్ లో బంతిని చిన్నగా పుష్ చేసి సింగిల్ తీద్దామని ప్రయత్నించాడు. అదే సమయంలో స్టోక్స్ వేగంగా ముందుకు వెళ్లి అంతలోనే వెనక్కి తిరిగి వికెట్లకు డైరెక్ట్ త్రో విసిరాడు. రీప్లేలో పంత్ ఔటైని తేలింది. దీంతో అప్పటివరకు జాగ్రత్తగా ఆడుతున్న పంత్ రనౌట్ (74) కారణంగా రాహుల్ కోసం ఔటయ్యాడు. ఈ వికెట్ ఇంగ్లాండ్ జట్టులో ఫుల్ జోష్ నింపింది. రాహుల్ తొలి సెషన్ లోనే సెంచరీ చేసుకోవాలనే ఆరాటంలో పంత్ పై ఒత్తిడి కలిగించి అతడిని ఔట్ చేసినట్టు అర్ధమవుతుంది. దీంతో రాహుల్, పంత్ మధ్య 148 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆధిపత్యం సంపాదించలేకపోయింది.
ఓవరాల్ గా ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆలౌటైంది. రూట్ (100) సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు, బుమ్రా 5 వికెట్లతో రాణించాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో ఇండియా కూడా సరిగ్గా 387 పరుగులు చేసింది. రాహుల్ సెంచరీ చేసి ఇండియాను ఆదుకున్నాడు. భారత బౌలర్లు విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 192 పరుగులకే ఆలౌట్ అయింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 170 పరుగులకు ఆలౌట్ అయింది.