టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ కు ప్రస్తుతం బ్యాడ్ లక్ నడుస్తోంది. గత ఏడాది ఇండియా టెస్ట్, వన్డే కెప్టెన్సీ గిల్ కు అప్పగించడంతో పాటు టీ20ల్లో వైస్ కెప్టెన్ గా ప్రకటించారు. ఒక్కసారిగా గిల్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్ గా కితాబులందుకున్నాడు. అయితే ఆసియా కప్ నుంచి గిల్ కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఆసియా కప్ లో పేలవ ప్రదర్శన చేసిన తర్వాత కెప్టెన్ గా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సిరీస్ లో కెప్టెన్ గా, బ్యాటర్ గా ఫెయిలయ్యాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ తర్వాత ఇండియా టీ20 జట్టులో స్థానం కోల్పోయాడు. స్వదేశంలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు ఫామ్ లేని కారణంగా గిల్ ఎంపిక కాలేదు.
2026 లోనూ గిల్ కు మంచి ఆరంభం రాలేదనే చెప్పాలి. గిల్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా సొంతగడ్డపై 1-2 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది. వరల్డ్ కప్ లో చోటు కోల్పోయిన గిల్ రంజీ ట్రోఫీ ఆడాలని నిర్ణయించుకున్నాడు. గురువారం (జనవరి 22) సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్ లో బరిలోకి దిగాడు. తొలి ఇన్నింగ్స్ లో గిల్ డకౌటయ్యాడు. నేహాల్ వధేరా ఔటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన గిల్ ఎదుర్కొన్న రెండో బంతికే పెవిలియన్ బాట పట్టాడు. పార్ద్ బట్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఫామ్ కోసం రంజీ బాట పట్టిన గిల్.. డొమెస్టిక్ క్రికెట్ లోనూ ఈ టీమిండియాకు నిరాశే ఎదురైంది.
- ALSO READ | Abhishek Sharma: దేశం కోసం చాలా చేశాడు.. అతని అడుగుజాడల్లోనే నడుస్తున్నాను: అభిషేక్ శర్మ
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 172 పరుగులకు ఆలౌటైంది. గోహిల్ ఒక్కడే 82 పరుగులు చేసి సగానికి పైగా పరుగులు చేశాడు. ప్రేరక్ మన్ కండ్ 32 పరుగులు చేసి రాణించాడు. వీరిద్దరూ తప్పితే మిగిలిన వారు తక్కువ స్కోర్ కే ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో హరిప్రీత్ బ్రార్ ఏకంగా 6 వికెట్లు తీసుకొని అదరగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కూడా బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. ప్రస్తుతం 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. సౌరాష్ట్ర బౌలర్లలో పార్ద్ బట్ నాలుగు వికెట్లు తీసుకొని రాణించాడు.
