Shubman Gill: వరల్డ్ కప్‌లో చోటు ఎందుకు కోల్పోయారు..? ప్రెస్ మీట్‌లో గిల్ సమాధానమిదే

Shubman Gill: వరల్డ్ కప్‌లో చోటు ఎందుకు కోల్పోయారు..? ప్రెస్ మీట్‌లో గిల్ సమాధానమిదే

టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభమాన్ గిల్ వచ్చే నెలలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఫామ్ లో లేని గిల్ ను పక్కన పెట్టిన సెలక్టర్లు.. అతని స్థానంలో ఇషాన్ కిషాన్ ను ఎంపిక చేశారు. ఆసియా కప్ 2025 నుంచి గిల్ ను బలవంతంగా ఓపెనర్ గా కొనసాగించినా.. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంలో గిల్ విఫలమయ్యాడు. ఫామ్ లేక ఇబ్బందిపడుతున్న గిల్ పై సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకుని జట్టు నుంచి తప్పించారు. నమ్మకంతో ఎన్ని అవకాశాలు ఇచ్చినా శుభమాన్ వరుసగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారడంతో వరల్డ్ కప్ కు ఎంపిక చేయలేదు. 

ప్రస్తుతం గిల్ స్వదేశంలో న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు సిద్ధమవుతున్నాడు.  న్యూజిలాండ్ తో టీమిండియా ఆదివారం (జనవరి 11) తొలి వన్డే ఆడనుంది. వడోదర వేదికగా BCA స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తోంది. ఈ మ్యాచ్ కు ముందు ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న గిల్‌ను టీ20 వరల్డ్ కప్ నుంచి ఎందుకు తప్పించారని అడిగారు. ఈ ప్రశ్నకు గిల్ స్పందిస్తూ ఇలా అన్నాడు.. "సెలెక్టర్ల నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. టీ20 ప్రపంచ కప్ జట్టుకు నా శుభాకాంక్షలు. ఒక ప్లేయర్ ఎప్పుడూ కూడా దేశానికి అత్యున్నత ఆటను అందించాలని కోరుకుంటాడు. సెలక్టర్లు వారి పని వారు చేస్తారు. డెస్టినీని నేను మార్చలేను". అని ఈ టీమిండియా వన్డే కెప్టెన్ చెప్పుకొచ్చాడు. 

ఆసియా కప్ నుంచి గిల్ ఘోరంగా విఫలం: 

ఆసియా కప్ నుంచి గమనిస్తే గిల్ ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయారు. కాన్‌‌‌‌‌‌‌‌బెరాలో తొలి టీ20లో మాత్రమే కెప్టెన్ సూర్యతో కలిసి కాస్త మెప్పించాడు. ఆ తర్వాత నాలుగో వన్డేలో 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కేవలం 4 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. అడపాదడపా ఇన్నింగ్స్ లు తప్పితే గిల్ పెద్దగా రాణించడం లేదు. 

గిల్ చివరి 15 ఇన్నింగ్స్ లు చూసుకుంటే 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(0), 28(28) ఇలా ఉన్నాయి. కేవలం 3 సార్లు మాత్రమే 30 పరుగుల మార్క్ అందుకున్నాడు. సౌతాఫ్రికాపై జరిగిన రెండో టీ20లో తొలి బంతికే డకౌటయ్యాడు. మూడో టీ20లో 28 పరుగులు చేసినా 28 బంతులు తీసుకున్నాడు. ఓవరాల్ గా  ఈ ఏడాది గిల్ 15 ఇన్నింగ్స్ ల్లో 24.25 యావరేజ్.. 137 స్ట్రైక్ రేట్ తో 291 పరుగులు చేశాడు.