IND vs ENG 2025: న్యూ బాల్ తీసుకోకుండానే గెలిచిన టీమిండియా.. కారణం చెప్పిన గిల్

IND vs ENG 2025: న్యూ బాల్ తీసుకోకుండానే గెలిచిన టీమిండియా.. కారణం చెప్పిన గిల్

ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో టీమిండియా సంచలన విజయం సాధించింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి రోజు భారత్ విజయం అసాధ్యమని భావించినా మన ఫాస్ట్ బౌలర్లు సిరాజ్, ప్రసిద్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 303 పరుగులకు 301 పరుగులతో విజయం దిశగా దూసుకెళ్లినా టీమిండియా పేసర్ల ధాటికి 367 పరుగులకు ఆలౌట్ అయింది.   

ఈ మ్యాచ్ లో భారత్ కొత్త బంతి తీసుకోకుండానే విజయం సాధించడం విశేషం. ఐదో రోజుకు ముందు మరో 22 బంతుల తర్వాత 80 ఓవర్లు పూర్తి అవుతాయి. ఈ సమయంలో భారత జట్టుకు రెండో కొత్త బంతి తీసుకునే అవకాశం ఉంది. 80 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 8 వికెట్లను కోల్పోయింది. గెలవాలంటే 20 పరుగులు చేస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా న్యూ బాల్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ టీమిండియా కెప్టెన్ గిల్ మాత్రం కొత్త బంతిపై ఆసక్తి చూపించలేదు. సూపర్ గా బౌలింగ్ చేస్తున్న సిరాజ్, ప్రసిద్ కృష్ణలను పాత బంతితోనే కొనసాగించాడు. 83 ఓవర్లో ప్రసిద్ కృష్ణ జోష్ టంగ్ ను క్లీన్ బౌల్డ్ చేయగా.. విజయానికి మరో 8 పరుగులు అవసరం అనుకున్న సమయంలో సిరాజ్ అట్కిన్సన్ ను బౌల్డ్ చేసి మ్యాచ్ ముగించాడు. 

మ్యాచ్ తర్వాత కెప్టెన్ గిల్ విలేకరుల సమావేశంలో సెకండ్ న్యూ బాల్ ఎందుకు తీసుకోలేదో వివరించాడు. " రెండవ బంతి తీసుకునే అవకాశం మాకు ఉంది. కానీ సిరాజ్, ప్రసిద్ బౌలింగ్ చేస్తున్న తీరు చూస్తే, మాకు కొత్త బంతి అవసరం అనిపించలేదు. బంతి 80 ఓవర్లు పాతది అయినప్పటికీ వారు మా కోసం ఏం చేయగలరో మాకు తెలుసు. ఆ సమయంలో ఇంగ్లాండ్‌పై చాలా ఒత్తిడి ఉందని మాకు తెలుసు". అని గిల్ అన్నాడు. ఐదో రోజు పాత బంతితోనే భారత జట్టు 8 ఓవర్ల పాటు బౌలింగ్ చేయడం విశేషం. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా తొలి ఇన్నింగ్స్ 224 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ 57 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిస్తే.. ఇంగ్లాండ్ పేసర్ అట్కిన్సన్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 247 పరుగులకే పరిమితమైంది. సిరాజ్, ప్రసిద్ కృష్ణ తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. దీంతో ఇంగ్లాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో 23 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్ లో జైశ్వాల్ (118) సెంచరీతో ఇండియా 396 పరుగులు చేసింది. టంగ్ ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 374 పరుగుల ఛేజింగ్ లో ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌటైంది.