IND vs ENG 2025: 46 ఏళ్ళ సునీల్ గవాస్కర్ రికార్డ్ బద్దలు.. కెప్టెన్‌గా గిల్ సరికొత్త చరిత్ర

IND vs ENG 2025: 46 ఏళ్ళ సునీల్ గవాస్కర్ రికార్డ్ బద్దలు.. కెప్టెన్‌గా గిల్ సరికొత్త చరిత్ర

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ ఇంగ్లాండ్ సిరీస్ లో ఒక్కొక్క రికార్డ్ బద్దలు కొట్టుకుంటూ వెళ్తున్నాడు. గురువారం (జూలై 31) ఓవల్ స్టేడియంలో ప్రారంభమైన ఐదో టెస్టులో మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్ లో ఇప్పటివరకు 737 పరుగులు చేసిన గిల్.. ఒకే టెస్ట్ సిరీస్ లో అత్యధిక  పరుగులు చేసిన భారత కెప్టెన్ గా నిలిచాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ టీమిండియా కెప్టెన్ ఈ ఘనతను అందుకున్నాడు. 1979లో వెస్టిండీస్‌పై గవాస్కర్ 732 పరుగులు చేసిన రికార్డ్ ను బ్రేక్ చేసి టాప్ లోకి వెళ్ళాడు.    

46 ఏళ్లుగా పదిలంగా ఉన్న ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి కెప్టెన్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాహుల్ ఔటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన గిల్ ప్రస్తుతం 3 ఫోర్లతో 15 పరుగుల బ్యాటింగ్ చేస్తున్నాడు. ఓకే టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టడానికి శుభ్‌మాన్ గిల్ కేవలం 53 పరుగుల దూరంలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో గవాస్కర్ 154.8 సగటుతో 774 పరుగులు చేశాడు. 54 ఏళ్లుగా ఈ రికార్డ్ చెక్కు చెదరకుండా పదిలంగా ఉంది. మరి ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి సెషన్ లో రెండు వికెట్లు కోల్పోయింది. లంచ్ కు ముందు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. ఫామ్ లో ఉన్న రాహుల్ (14) తో పాటు జైశ్వాల్ (2) ఔటయ్యాడు. క్రీజ్ లో కెప్టెన్ గిల్ (15), సాయి సుదర్శన్ (25) ఉన్నారు.తొలి సెషన్ కు ముందు సడన్ గా భారీ వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది.