- తుది జట్టులోకి సుదర్శన్, నితీష్‌రెడ్డిని తీసుకునే చాన్స్
గువాహతి: సౌతాఫ్రికాతో కీలకమైన రెండో టెస్టుకు ముందు టీమిండియాకు బ్యాడ్‌న్యూస్! తొలి టెస్టులో మెడ కండరాల నొప్పితో బాధపడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, డాక్టర్ల సూచన మేరకు ఈ మ్యాచ్‌కు దాదాపుగా దూరం కానున్నాడు. మ్యాచ్ సమయంలో మళ్లీ నొప్పి తిరగబెట్టే ప్రమాదం ఉన్నందున అతడిని ఆడించి రిస్క్ చేయకూడదని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ కారణంగానే తను గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉన్నాడు. శనివారం మొదలయ్యే మ్యాచ్‌లో గిల్ ఆడే అవకాశాలు చాలా తక్కుగా ఉండగా.. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ టీమ్ చివరి నిమిషం వరకూ వేచి చూడనుంది.
శుక్రవారం గిల్‌కు ఫిట్‌నెస్ టెస్టు నిర్వహించనుంది. ‘గిల్ బాగా కోలుకుంటున్నాడు. తను ఆడే విషయంపై రేపు (శుక్రవారం) సాయంత్రం నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే తను పూర్తిగా కోలుకున్నాడా ? ఈ మ్యాచ్‌లో ఆడితే నొప్పి తిరగబెడుతుందా? అనే దానిపై డాక్టర్లు, ఫిజియో నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి అనుమానం ఉన్నా గిల్ ఈ టెస్టుకు దూరంగా ఉండి రెస్ట్ తీసుకుంటాడు’ అని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ చెప్పాడు. మరో వైపు గాయం కారణంగా తొలి టెస్టు ఆడని సౌతాఫ్రికా స్పీడ్ స్టర్ కగిసో రబాడ ఈ మ్యాచ్‌కూ దూరంగా ఉండే చాన్సుంది.
నితీష్ రెడ్డికే మొగ్గు !
ఒకవేళ గిల్ ఆడకపోతే, రిషబ్ పంత్ ఇండియా 38వ టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.ఈ కీలక మార్పుతో పాటు తుది జట్టులో రెండు ముఖ్యమైన స్థానాలపై టీమ్ మేనేజ్‌మెంట్ తీవ్రంగా ఆలోచిస్తోంది. గిల్ స్థానంలో రిజర్వ్ బెంచ్‌లోని లెఫ్టాండ్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ వైపు మొగ్గు చూపనున్నట్లు సమాచారం. తొలి టెస్ట్‌లో మూడో నంబర్‌లో మెరుగ్గా ఆడిన వాషింగ్టన్ సుందర్‌ను కొనసాగించి, సుదర్శన్‌ను ఆరో నంబర్‌లో బ్యాటింగ్ కు పంపే అవకాశం ఉంది.
మరొక కీలక స్థానం స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, సీమ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మధ్య పోటీగా మారింది. అక్షర్ పటేల్ మెరుగైన బ్యాటింగ్‌ను అందించగలడు. కానీ పిచ్‌పై పచ్చిక ఉండి బౌన్స్‌కు అనుకూలిస్తే రైట్ హ్యాండ్ బ్యాటర్ నితీష్ రెడ్డికి సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ గా అవకాశం దక్కే చాన్స్ ఉంది. ఐదో బౌలర్‌గా నితీష్ రెడ్డి వస్తే పేస్ బౌలింగ్‌కు సపోర్ట్ లభించడంతో పాటు రైట్ హ్యాండ్ బ్యాటర్ల సంఖ్య కూడా పెరుగుతుందని టీమ్ మేనేజ్‌మెంట్ లెక్కలు వేస్తోంది. ఏదేమైనా తొలి టెస్ట్ ఓటమి తర్వాత సరైన కాంబినేషన్‌ను ఎంచుకుని సిరీస్ సమం చేయడానికి ఇండియా వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది.
ఎర్రమట్టి.. పిచ్‌పై పచ్చిక
తొలి టెస్టు మూడ్రోజుల్లోనే ముగియడంతో ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై విమర్శలు రాగా.. ఇప్పుడు అందరి దృష్టి గువాహతిలోని బర్సాపరా క్రికెట్ గ్రౌండ్ పిచ్‌పై ఉంది. ఎర్ర మట్టితో తయారు చేసిన వికెట్‌పై ప్రస్తుతం పచ్చిక పలుచగా ఉంది. గురువారం సాయంత్రం నీళ్లు పట్టారు. మ్యాచ్‌కు ముందు గడ్డిని తొలగిస్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. సాధారణంగా ఎర్రమట్టి పిచ్‌లు తొందరగా పొడిబారతాయి. తొలి రెండు రోజుల పాటు బౌన్స్‌కు అనుకూలించి మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లకు అద్భుతమైన టర్న్, అనూహ్యమైన బౌన్స్ లభించే చాన్సుంది.
ఇక, ఈశాన్య రాష్ట్రమైన గువాహతి తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఇక్కడి వాతావరణం కూడా మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. సాయంత్రం నాలుగు గంటలకే చీకటి పడుతోంది. మ్యాచ్‌ను అరగంట ముందుగానే (ఉదయం 9) ప్రారంభిస్తున్నారు. తొలి సెషన్ తర్వాత టీ బ్రేక్ ఇచ్చి.. ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తారు.
