ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం జరిగే దాకా కొట్లాడుతం

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం జరిగే దాకా కొట్లాడుతం

హైదరాబాద్ /ముషీరాబాద్, వెలుగు: ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం స్పందించి హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అభ్యర్థులకు న్యాయం చేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ కోరారు. వాళ్లకు న్యాయం జరిగేదాకా పోరాడతామన్నారు. తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి.. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులతో కలిసి మంగళవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్​లో నిరసన దీక్ష నిర్వహించారు. దీక్షలో పాల్గొన్నవాళ్లకు మల్లురవి, మహేశ్.. నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేసి మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు నిరాశకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రిలిమినరీ ఎగ్జామ్​లో 7 మార్కులు కలిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో మాత్రమే పోలీస్ రిక్రూట్​మెంట్​లో కఠిన నిబంధనలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని శివసేన రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీజీపీ ఆఫీసు ముట్టడికి యత్నం  

కానిస్టేబుల్ ​సెలక్షన్​లో అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని యూత్​కాంగ్రెస్​ డిమాండ్ ​చేసింది. మంగళవారం యూత్ కాంగ్రెస్​ అధ్యక్షుడు శివసేనా రెడ్డి నేతృత్వంలోని నాయకులు డీజీపీ ఆఫీసును ముట్టడించారు. హైకోర్టు ఆదేశాలను సర్కార్ ​వెంటనే అమలు చేయాలని కోరారు. పోలీస్ ​ఈవెంట్లలో లాంగ్​ జంప్​ను 4 మీటర్ల నుంచి 3.8 మీటర్లకు తగ్గించాలన్నారు. శివసేనా రెడ్డిని పోలీసులు అరెస్ట్​ చేసి నాంపల్లి​ పీఎస్​​కు తరలించారు.