డాక్టర్ సూసైడ్ కేసులో ఎస్ఐ గోపాల్ బద్నే అరెస్ట్

డాక్టర్ సూసైడ్ కేసులో ఎస్ఐ గోపాల్ బద్నే అరెస్ట్
  • కస్టడీలో మరో నిందితుడు ప్రశాంత్
  • మృతురాలిపై ప్రశాంత్​ సోదరి సంచలన కామెంట్లు
  • ఆమే మా అన్నను వేధించిందని ఆరోపణ
  • బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తాం: సీఎం ఫడ్నవిస్

పుణె/సతారా: మహారాష్ట్రలోని సతారా జిల్లా డాక్టర్​ఆత్మహత్య కేసులో కీలక నిందితుడైన ఎస్ఐ గోపాల్ బద్నేను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం సతారాలోని ఫల్తాన్ రూరల్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో బద్నే లొంగిపోయాడు. ఆ తర్వాత అతన్ని అరెస్టు చేసినట్లు సతారా ఎస్పీ తుషార్ దోషి ప్రకటించారు. కాగా, మరో నిందితుడైన సాఫ్ట్​వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్‎ను శనివారం ఉదయమే ఫల్తాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని సతారా జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా.. 4 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. 

కాగా, మహారాష్ట్ర మరాఠ్వాడ రీజియన్‎లోని బీడ్ జిల్లాకు చెందిన యువ వైద్యురాలు గురువారం రాత్రి ఫల్తాన్ సిటీలోని ఒక హోటల్ గదిలో ఉరేసుకుని చనిపోయింది. మృతురాలు తన అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్‌‌‌‌‌‌‌‌లో, ఎస్ఐ బద్నే తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఇంజనీర్ అయిన ప్రశాంత్ బంకర్ తనను మానసికంగా వేధించాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై కేసు నమోదైంది.

మా అన్ననే లొంగిపోయాడు: టెకీ సోదరి

మహిళా డాక్టర్‎పై నిందితుడు ప్రశాంత్ బంకర్ సోదరి సంచలన కామెంట్లు చేసింది. ‘‘మా అన్న ఎప్పుడూ ఆమెకు కాల్ చేయలేదు. దానికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్ పోలీసులకు సబ్మిట్ చేశాను. ఆమే పదేపదే ఫోన్ చేసి పెండ్లి కోసం, ఫిజికల్ రిలేషన్ షిప్ కోసం ఒత్తిడి చేసేది. ఆ రిక్వెస్ట్‎ను మా అన్న రిజెక్ట్ చేశాడు. దీంతో మా అన్నపై ఆమె కోపం పెంచుకున్నది. అందుకే సూసైడ్ నోట్‎లో ప్రశాంత్​ పేరు రాసింది’’అని తెలిపింది.

బాధితురాలి ఫ్యామిలీకి న్యాయం చేస్తం: సీఎం

బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తాను విశ్రమించబోనని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. సతారా జిల్లా ఫల్తాన్‎లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం ఫడ్నవిస్.. యువ వైద్యురాలి ఆత్మహత్య ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. మాజీ ఎంపీ రంజిత్‌‌‌‌‌‌‌‌ సిన్హా నాయక్‌‌‌‌‌‌‌‌ నింబాల్కర్‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యే సచిన్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌ పేర్లు ఈ కేసుతో ముడిపడి ఉన్నాయన్న ఆయన.. ఈ కేసును రాజకీయం చేసే ప్రయత్నాలను సహించేదిలేదన్నారు.