
- కాంగ్రెస్ లీడర్ సిద్ధరామయ్య
బెంగళూరు: ‘‘బిట్ కాయిన్ కుంభకోణం ఆరోపణలను పట్టించుకోవద్దని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి ప్రధాని నరేంద్ర మోడీ సలహాలిస్తున్నారు. విచారణ చేయించి నిర్దోషిత్వం రుజువు చేసుకొమ్మని చెప్పాల్సింది పోయి ఇవేం సలహాలు?” అని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ లీడర్ సిద్ధరామయ్య ఫైరయ్యారు. అంటే, విచారణే చేయించొద్దని సీఎంకు చెప్తుతున్నారా అని ప్రశ్నించారు. ప్రధాని ఇలా ప్రవర్తించొచ్చా అంటూ దుయ్యబట్టారు. ‘‘ఇందులో బొమ్మై పాత్ర ఉందని మేమనడంలేదు. కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్నది బీజేపీ సర్కార్లేగా! నిష్పాక్షిక విచారణ జరిపించి నేరగాళ్లను శిక్షించాలనే కోరుతున్నాం” అని చెప్పారు. శ్రీకృష్ణ అనే హ్యాకర్ దేశవ్యాప్తంగా జన్ ధన్ ఖాతాలను హ్యాక్ చేసి రూ.6,000 కోట్లు కాజేశాడన్న ఆరోపణలపై తక్షణం విచారణ చేయించాలని మాజీ సీఎంకుమారస్వామి డిమాండ్ చేశారు. దీన్ని కప్పిపెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలున్నాయన్నారు. బిట్ కాయిన్ కుంభకోణం కర్నాటకలో కొద్దిరోజులుగా దుమారం రేపుతోంది. బెంగళూరుకు చెందిన శ్రీకృష్ణ నుంచి రూ.9 కోట్ల విలువైన బిట్ కాయిన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గవర్నమెంట్ పోర్టళ్ల హ్యాకింగ్, డార్క్ నెట్ ద్వారా డ్రగ్స్ అమ్మడం, క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్లు జరపడం వంటి ఆరోపణలు మోపారు. దీని వెనక రాజకీయ పెద్దలున్నారని దుమారం రేగుతోంది.