- కర్నాటక సీఎం పదవికి రాజీనామా చేశాక పలు డిమాండ్లపై చర్చ
న్యూఢిల్లీ: కర్నాటక సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. నాలుగు రోజుల వ్యవధిలో ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌ను కలవడం ఇది రెండోసారి. ఈ పర్యటనలో ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య కూడా ఉండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే తాను స్వచ్ఛందంగా రాజీనామా చేశానని 77 ఏళ్ల సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
అయితే, తన కుమారుడు యతీంద్రను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ముందస్తు షరతుతోనే ఆయన రాజీనామాకు అంగీకరించినట్లు సమాచారం. అంతేకాకుండా, కాబోయే ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ నేతృత్వంలో ఉండబోయే నలుగురు డిప్యూటీ సీఎంలలో యతీంద్రకు అవకాశం ఇవ్వాలని సిద్ధరామయ్య కోరినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ ప్రతిపాదనపై డీకే.శివకుమార్ సుముఖంగా లేరని తెలుస్తోంది. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, ఎమ్మెల్యే కేజే.జార్జ్ కూడా పాల్గొన్నారు. కర్నాటకలో అధికార మార్పిడి ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగుతుందని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి రణదీప్ సుర్జేవాలా తెలిపారు.
- సీఎం రేసులో డీకేఎస్.. తదుపరి కేపీసీసీ చీఫ్ ఎవరు?
రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఆయనే కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై కూడా చర్చలు జరిగాయి. సీనియర్ నాయకుడు సతీశ్జార్కిహోళిని డిప్యూటీ సీఎంగా గానీ కేపీసీసీ అధ్యక్షుడిగా గానీ నియమించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
