
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తెలుసు కదా’ (Telusu Kada). రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మించింది. ఈ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ఇవాళ (అక్టోబర్ 17న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీకి యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసారు. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
ఇటీవలే సిద్దు జాక్ సినిమాతో వచ్చి డిజాస్టర్ అందుకున్నాడు. ఈ క్రమంలో తనను తాను మళ్ళీ ప్రూవ్ చేసుకునేలా ఓ అందమైన రొమాంటిక్ ప్రేమకథతో రావడం అంచనాలు పెంచింది. ఇలా క్లీన్ కామెడీ, లవ్ స్టోరీతో వచ్చిన ‘తెలుసు కదా’.. సిద్దుకి ఎలాంటి హిట్ ఇచ్చిందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే:
వరుణ్ (సిద్ధూ జొన్నలగడ్డ) అనాధ. రెస్టారెంట్ బిజినెస్ నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో పెళ్లి, పిల్లల ద్వారా కంప్లీట్ ఫ్యామిలీ అవ్వాలనుకుంటాడు. అలా వరుణ్ ఒక మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా అంజలి (రాశీ ఖన్నా)ను పెళ్లి చేసుకుంటాడు. కానీ తను తల్లి కాలేదని తెలుస్తుంది.
ఈ క్రమంలో సరోగసీ ద్వారా పిల్లలు కావాలనుకుంటారు. డాక్టర్ రాగ (శ్రీనిధి శెట్టి) సరోగసీ మదర్ అవ్వడానికి ఒప్పుకుంటుంది. అయితే ఆమె వరుణ్ మాజీ ప్రియురాలు అని తెలుస్తుంది.
అయితే, వరుణ్- రాగల ప్రేమ ఎలా విడిపోయింది? డాక్టర్ రాగా కుమార్ సరోగసికి ఎందుకు రెడీ అయ్యింది? వరుణ్ లైఫ్ లోకి రాగ ఎంట్రీ ఇచ్చాక.. ఎదురయ్యే పరిణామాలే మిగతా కథ.
ఎలా ఉందంటే:
ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా వచ్చిన తెలుసు కదా.. యూనిక్ పాయింట్తో తెరకెక్కింది. టాలీవుడ్లో ఇప్పటివరకు చాలా ట్రయాంగిల్ లవ్‌స్టోరీస్ వచ్చాయి. అందులో ఇది భిన్నం. సినిమాలో హీరో చెప్పినట్టుగా.. ‘నాకు రాసిపెట్టున్న అమ్మాయి ఎవరో తనంతటే తానే నా లైఫ్‌లోకి రావాలి’.. కథకు పర్ఫెక్ట్ సెట్ అయ్యేలా రాశారు. ఎందుకంటే.. ‘‘పెళ్లికి ముందు ఓ ప్రేమ అది చేసే ఓ మోసం.. పెళ్లి తర్వాత తల్లికాలేని భార్య.. అలా ప్రియుడి బాధను అర్థం చేసుకొని తల్లి కావడానికి వచ్చిన ప్రియురాలు’’ ఇదే సినిమా కథ. అయితే.. వీరి మధ్యలో నడిచే భావోద్వాగాల సారమే ‘తెలుసు కదా’ ముఖ్య ఉద్దేశ్యం.
ఇలాంటి సున్నితమైన అంశాలకు ఆడియన్స్ ఎప్పుడైనా పెద్దపీఠ వేస్తారు. కథలో భాగంగా ప్రియురాలు ముందుకొస్తే స్వాగతిస్తారు. కావాలనే డైరెక్టర్ ఇరికించే ప్రయత్నం చేస్తే సినిమా ఫలితాన్నే మార్చేస్తారు. ఇలా తొలి సినిమాతోనే సెన్సిటివ్ పాయింట్ని ఎంచుకున్న డైరెక్టర్ నీరజ ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే!!
ఫస్టాఫ్ విషయానికి వస్తే.. సిద్ధు లవ్ బ్రేకప్ సీన్‌తో మొదలవుతుంది. అలా సిద్దు పడే బాధను చూపెడుతూ మెల్లగా, తన పర్సనల్ లైఫ్ చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే సిద్దు పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఆపై వింతైన అమ్మాయిలు కలవడం ఆడియెన్స్లో క్రేజీ ఫీలింగ్ ఇస్తుంది. అలా సిద్ధు లైఫ్ లోకి రాశీఖన్నా ఎంట్రీ అవ్వడం, పెళ్లవ్వడం, ఈ తరుణంలో వీరి మధ్య వచ్చే రొమాన్స్.. ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తిగా ఉంటుంది.
అలాగే, ఫస్టాఫ్లో వైవా హర్ష, సిద్ధు జొన్నలగడ్డ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. ఇదే సమయంలో అంజలి తల్లి కావడం కుదరదని, సరోగసీ మదర్ అవ్వడానికి ఒప్పుకోవడం.. ఈ క్రమంలోనే డాక్టర్ రాగా కుమార్ ఎంట్రీ ఇవ్వడంతో అసలు కథ షురూ అవుతుంది. ఇలా వీరి మధ్య సాగే సీన్స్.. కథ ముందుకెళ్లే కొద్దీ ఎమోషనల్ రైడ్తో సాగడం ఇంటర్వెల్ విజయవంతంగా పూర్తీ అవుతుంది.
సెకండాఫ్లో వరుణ్, రాగాల గురించి అంజలికి తెలిసిన తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ. ఇలా వీరి మధ్య వచ్చే డ్రామాలో.. ట్విస్టులు.. డైలాగ్స్‌తో.. సినిమా ముగించిన విధానం బాగుంది. చివరగా.. క్లైమాక్స్‌లో దర్శకురాలు నీరజ ఇచ్చిన మెసేజ్ ఆలోచింపజేస్తుంది.
ఎవరెలా నటించారంటే:
సిద్ధు జొన్నలగడ్డ తన మార్క్ నటనతో సినిమాను నిలబెట్టాడు. లవ్, ఈగో, ఎమోషన్స్‌తో కూడిన వరుణ్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. శ్రీనిధి, రాశీ ఖన్నాలతో సిద్దు కెమిస్ట్రీ తెరపై క్యూరియాసిటీని తీసుకొచ్చింది. హీరో భార్య అంజలిగా రాశీ ఖన్నా చక్కటి ప్రతిభను కనబరిచింది. ప్రేమ, పెళ్లి వద్దు.. ఉన్నంత సేపు హ్యాపీగా ఉందాం అనే ఆలోచించే అమ్మాయిగా రాగా పాత్రకి శ్రీనిధి న్యాయం చేసింది. కమెడియన్ వైవా హర్ష తన కామెడీతో సినిమాకు మెయిన్ పిల్లర్ గా మారాడు. తనదైన మార్క్ కామెడితో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించాడు. మిగతా పాత్రలు సైతం న్యాయం చేశాయి.
సాంకేతిక అంశాలు:
తమన్ అందించిన సంగీతం ఈ మూవీకి బ్యాక్ బోన్గా నిలిచింది. ఫీల్ గుడ్ ఎమోషనల్ మ్యూజిక్ ఇచ్చాడు. యువరాజ్ సినిమాటోగ్రాఫీ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి చక్కటి ఎడిటింగ్ అందించారు. స్టైలిస్ట్ నీరజ కోన.. ఎంచుకున్న పాయింట్తో మెప్పించడమే కాకుండా.. డైరెక్టర్గా న్యాయం చేశారు. సున్నితమైన అంశాన్ని.. అర్ధం అయ్యే శైలిలో తీసుకొచ్చి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు.