పోలీస్‌‌ కంట్రోల్‌‌లో సిద్దిపేట, దుబ్బాక

పోలీస్‌‌ కంట్రోల్‌‌లో సిద్దిపేట, దుబ్బాక

అడుగడుగునా పెద్ద సంఖ్యలో పోలీసు, ఆర్మ్​డ్​ ఫోర్సెస్​ మోహరింపు

ఊర్లలోనూ స్పెషల్​ పోలీసులతో బందోబస్తు

తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న లీడర్లు, కార్యకర్తలు

స్థానిక నేతలను భయపెట్టి కంట్రోల్​ చేసేందుకేనని ఆరోపణలు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేటతోపాటు దుబ్బాక నియోజకవర్గంలో భారీ సంఖ్యలో పోలీసు, ఆర్మ్​డ్​ ఫోర్సెస్​ను సర్కారు రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే జిల్లా పోలీసు యంత్రాంగంలో చాలా వరకు బందోబస్తులో పెట్టారు. మూడు కంపెనీల ఆర్మ్​డ్​ ఫోర్సెస్​ సిద్దిపేటకు చేరుకున్నాయి. మరింత మంది స్పెషల్ పోలీసులను రప్పించనున్నారు. దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇప్పటికే స్పెషల్​ పోలీస్​ టీమ్​లు పనిచేస్తుండగా.. కీలక ప్రాంతాల్లో ఇంకా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. దుబ్బాక సెగ్మెంట్​అటు సిద్దిపేట, ఇటు మెదక్​ జిల్లాల పరిధిలో విస్తరించి ఉండటంతో.. రెండు జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్​ అమల్లో ఉంది. కోడ్​ను సక్రమంగా అమలు చేయాలన్న పేరిట గ్రామాల్లో పోలీసులను దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే బైఎలక్షన్​ ప్రచారం జోరందుకోవడంతో ఎప్పుడు, ఎలాంటి ఘటనలు జరిగినా అలర్ట్​గా ఉండేందుకే పోలీసులను మోహరిస్తున్నామని ఉన్నతాధికారులు చెప్తున్నారు.

గతంలో పనిచేసిన వాళ్లను తెచ్చి..

సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో గతంలో పనిచేసిన పోలీసు అధికారులను ఎలక్షన్​ డ్యూటీ కోసం రప్పిస్తున్నారు. రెండు సెగ్మెంట్లలో పరిస్థితుల గురించి క్లియర్​గా తెలిసినందున వారి సేవలను ఉపయోగించుకుంటామని అధికారులు చెప్తున్నారు. గతంలో సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో పనిచేసిన సీఐలు, ఎస్సైలను పదుల సంఖ్యలో రప్పించడం కనిపించింది. వారికి జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా బాధ్యతలను అప్పగిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే దుబ్బాక సెగ్మెంట్ లో రూట్​ మొబైల్​ పార్టీలు, స్ట్రయికింగ్​ ఫోర్స్ లు, ఫ్లయింగ్​ స్క్వాడ్​ టీమ్​లు పనిచేస్తున్నాయి. వీటన్నింటినీ గతంలో ఇక్కడ పనిచేసిన వారితోనే ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. వారికి ఆయా ప్రాంతాల్లోని నేతల గుట్టుమట్లు తెలిసి ఉండటంతో.. వ్యూహాత్మకంగా ఆయా నేతలను కంట్రోల్​ చేసే అవకాశం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక మంగళవారం ఒక్క రోజే వందల సంఖ్యలో పోలీసులు సిద్దిపేటకు చేరుకున్నారు. అదనంగా వచ్చిన అధికారులు, పోలీసులను వారికి సపొర్టింగ్​గా ఉంచుతామని అధికారులు అంటున్నారు. అయితే భారీగా పోలీసుల మోహరింపు వల్ల ఒకరకమైన భయానక వాతావరణం కనిపిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.

బీజేపీ శ్రేణులపై ఆరా తీస్తూ..

దుబ్బాక సెగ్మెంట్ లోని గ్రామాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామాల్లోని ముఖ్యులకు స్పెషల్​ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులు ఫోన్  చేస్తున్నారని.. బీజేపీ శ్రేణుల వివరాలను, వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నట్టు సమాచారం. ఈ వివరాలు ఎందుకని ప్రశ్నిస్తే.. మామూలుగానే సమాచారం కోసం అడుగుతున్నామంటూ జవాబు దాటవేస్తున్నట్టు తెలుస్తోంది. పోలింగ్​ రోజు దగ్గరపడుతున్న కొద్దీ ఇట్లా బీజేపీ శ్రేణుల వివరాలు ఆరా తీస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో బీజేపీ లీడర్లను పోలీసు కేసుల పేరిట బెదిరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. మాజీ ఎంపీలు వివేక్​ వెంకటస్వామి, జితేందర్​రెడ్డి ఈ విషయాన్ని సిద్దిపేట పోలీస్​ కమిషనర్​ జోయల్​ డేవిస్​దృష్టికి తీసుకెళ్లారు.

పోలింగ్​ సజావుగా సాగేందుకే..

దుబ్బాక బై ఎలక్షన్​ ఫ్రీ అండ్​ ఫెయిర్​గా నిర్వహించడానికి, ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించడానికి అదనపు బలగాలను రప్పిస్తున్నం. ఎలక్షన్​ కోడ్​ను ప్రతి ఒక్కరూ పాటించేలా పోలీసులు కృషి చేస్తున్నరు. పోలీసుల రాక వల్ల గ్రామాల్లో ఎలాంటి భయోత్పాతం ఉండదు. కేవలం పోలింగ్​ సజావుగా జరపడంపైనే దృష్టి పెట్టినం.

– జోయల్ డేవిస్, సిద్దిపేట సీపీ

For More News..

చంద్రునిపై మస్తు నీళ్లు.. తేల్చిన నాసా..

దసరాకు నిమిషానికి రూ. 1.5 కోట్ల స్మార్ట్‌‌ఫోన్లు కొన్నరు