హుస్నాబాద్, వెలుగు: రైతులు వడ్లను కళ్లాల దగ్గరే ఆరబెట్టుకుని, తేమ శాతం వచ్చిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి సూచించారు. మంగళవారం హుస్నాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో మక్కలు, వరి ధాన్యం కొనుగోళ్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్ యార్డులో ధాన్యం ఆరబెట్టడం వల్ల అకాల వర్షాలు వస్తే రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందన్నారు.
యార్డులో మక్కలు, వరి ధాన్యానికి సరిపడా స్థలం లేదని, రైతులు తమకు దగ్గరలోని గ్రామాల్లో ఉన్న సెంటర్లలోనే వడ్లు అమ్ముకోవాలని సూచించారు. కాగా తమ వడ్లు రెడీగా ఉన్నా లారీలు రావడం లేదని రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో ఆమె వెంటనే సివిల్ సప్లై డీఎంకు ఫోన్ చేసి, సరిపడా లారీలను హుస్నాబాద్ పంపాలని ఆదేశించారు. ఆమె వెంట ఆర్డీవో రామ్మూర్తి, ఏఏంసీ చైర్మన్ తిరుపతి రెడ్డి ఉన్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
మెదక్ టౌన్ : మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు లేకుండా వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ నిత్యానంద్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ యాసంగి సీజన్‌కు సంబంధించి వడ్ల కొనుగోళ్లు పక్కాగా కొనసాగుతున్నాయన్నారు. రైతులకు సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 9281103685 ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.
