
- ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు హైకోర్టు తీర్పు
సిద్దిపేట, వెలుగు: హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన సిద్దిపేట కలెక్టర్, ఆర్డీవో, గతంలో పనిచేసిన కలెక్టర్ కు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన వేములఘాట్ గ్రామానికి చెందిన గాండ్ల తిరుపతి భూమిలో ఎలాంటి పనులు చేయకూడదని కోర్టు ఆదేశించినా.. అక్కడ కట్ట కట్టారు. 2018 న ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు అప్పటి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ప్రస్తుత జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డితోపాటు సిద్దిపేట ఆర్డీవో జయచంద్రారెడ్డి లకు రూ.2 వేల ఫైన్ విధించారు. రైతు తిరుపతి వ్యవసాయ భూమిని నష్టపరిచినందుకు ప్రస్తుత కలెక్టర్ వెంకట్రామరెడ్డికి 3 నెలల సాధారణ జైలు, రూ. 25 వేల జరిమానా, సిద్దిపేట ఆర్డీవో జయచంద్రారెడ్డికి 4 నెలల సాధారణ జైలు, రూ. 50 వేల జరిమానా విధించింది. దీనిని వారి సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని సీఎస్ ను హైకోర్టు ఆదేశించింది.