- సీపీ విజయ్కుమార్
గజ్వేల్, వెలుగు: రాజీవ్ రహదారిపై ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్‌కుమార్ చెప్పారు. శనివారం ఆయన రాజీవ్ రహదారిపై రోడ్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించారు. వంటిమామిడి నుంచి దుద్దెడ వరకు రహదారిని విశ్లేషణాత్మకంగా పరిశీలించి ప్రమాదకర ప్రాంతాలపై కీలక సూచనలు చేశారు.
ఆయనతో పాటు హెచ్‌కేఆర్ ఇన్‌ఫ్రా డీజీఎం విజయ్ భాస్కర్ రెడ్డి, సైట్ ఇంజనీర్లు శ్రీనివాస్, కిషోర్, హైదరాబాద్ ఆర్అండ్బీ కన్సల్టెంట్ పీవీ రావుతో రహదారిపై పగుళ్లు, గుంతలు, ఎడ్జ్ల వద్ద దెబ్బతిన్న లొకేషన్లు, నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. రహదారిపై అవసరమైన చోట్ల బస్‌బేలు, రంబుల్ స్ట్రిప్స్, ప్రమాద సూచనలను ఏర్పాటు చేయాలని సూచించారు.
రాజీవ్ రహదారిపై, డివైడర్లపై, విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేసిన అనధికారిక ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. పోలీసు అధికారులు హైవే అథారిటీతో సమన్వయం చేసుకుని ఫ్లెక్సీలను తొలగించనున్నారు. కొడకండ్ల స్కూల్ మందు రాయవరం రోడ్డు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతన్నాయని హెచ్ఎం శ్రీనివాస్ సీపీ దృష్టికి తెచ్చారు.
వెంటనే ఆయనస్పాట్ను సందర్శించి అక్కడ పాఠశాల విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏసీపీలు నర్సింలు, సుమన్ కుమార్, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది,హెచ్‌కేఆర్ ఇంజనీర్లు శ్రీనివాస్, కిశోర్ పాల్గొన్నారు.
