
హైదరాబాద్: సంగారెడ్డి సిగాచి పరిశ్రమ ప్రమాదంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. సిగాచి పరిశ్రమ ప్రమాదంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిగాచిపై న్యాయవాది కె.బాబూరావు పిల్ దాఖలు చేశారు. పరిశ్రమలో భద్రతా చర్యలు తీసుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. పేలుడు ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ దొరకలేదని హైకోర్టుకు తెలియజేశారు. బాధితులకు ప్రకటించిన పరిహారం ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని, సిగాచి పరిశ్రమ యజమానిని ఇప్పటివరకు అరెస్టు చేయలేదని.. ప్రమాదంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక బయటపెట్టాలని పిటిషనర్ కోరారు.
ఇదిలా ఉండగా.. ఫ్యాక్టరీలలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఇకపై అన్ని జిల్లాల్లో కెమికల్, ఫార్మా, హై-రిస్క్ పరిశ్రమలన్నింటికీ చెక్ లిస్ట్ను ప్రకటిస్తామన్నారు. నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిగాచి ఫ్యాక్టరీ ఘటనలో ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన సాధారణ సూచనలను పాటించి ఉంటే, కంపెనీకి రూ. 20 నుంచి రూ. 25 లక్షలకు మించి ఖర్చు అయ్యేది కాదన్నారు. ఇప్పుడు ప్రమాదం జరగడం వల్ల రూ. 50 కోట్ల పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
►ALSO READ | తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కాళేశ్వరం కమిషన్
డిఫెన్స్ రంగంలో పనిచేసిన కొందరు డైరెక్టర్లు ఉన్న కంపెనీలో కూడా సాధారణ నిబంధనలు అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కట్-ఆఫ్ కోసం థర్మోస్టాట్‌లు లేకపోవడం, ఒత్తిడి పెరిగినప్పుడు ఎలక్ట్రికల్ నియంత్రణలు లేకపోవడం, ఇంటర్ లాకింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయకపోవడం వంటి సాధారణ లోపాలే ప్రమాదానికి దారి తీశాయన్నారు. పాశమైలారం సిగాచి పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం జరిగి 46 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన పెను విషాదం నింపిన సంగతి తెలిసిందే. మరో ఎనిమిది మంది ఆచూకీ దొరకకపోవడం గమనార్హం.