- ఇప్పటికే కొంత అమౌంట్ బాధితులకు అందజేశాం
- మిగిలిన పరిహారం మార్చిలోగా చెల్లిస్తాం
హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తమ కంపెనీ రూ.42 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. గత జూన్ 30న సిగాచీలో జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రకటించిన రూ.కోటి పరిహారంలో రూ.42 లక్షలు కంపెనీ చెల్లిస్తుందని, ఇందులో ఈఎస్‌ఐ చట్టం కింద పీఎఫ్, బీమా సొమ్ము కూడా ఉంటుందని వివరించింది.
ఈ మేరకు జులై 1న సిగాచీ కంపెనీ ఒప్పందం చేసుకున్నట్లు వివరించింది. ఇప్పటివరకు పలు దఫాలుగా ఒక్కొక్కరికి రూ.5 నుంచి రూ.30 లక్షల వరకు చెల్లించామని వివరించింది. ఈ ఏడాది మార్చిలోగా మొత్తం పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ముందస్తు తేదీలతో పోస్టు డేటెడ్ చెక్కులను అందజేసినట్లు వివరించింది.
సిగాచీ పరిశ్రమలో జరిగిన రియాక్టర్ పేలుడులో 54 మంది మృతి చెందిన సంఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిల్‌లో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతివాదిగా ఉన్న సిగాచీ కంపెనీ.. ఆ ఫ్యాక్టరీ తరఫున ఓ అధికారి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఈ ఫ్యాక్టరీకి సంబంధించి పలు పత్రాలు ప్రమాదంలో కాలిపోయాయని, మిగిలిన వాటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారని, అందువల్ల కౌంటర్‌లో డాక్యుమెంట్లు సమర్పించలేకపోయామని చెప్పింది.
మూడు దశాబ్దాలుగా నడుస్తున్న ఫ్యాక్టరీపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని చెప్పింది. ఫ్యాక్టరీస్, పీసీబీ, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం, బాయిలర్స్ చట్టాల కింద అన్ని అనుమతులు తీసుకుని రసాయనాల తయారీ చేపడుతున్నట్లు వివరించింది. నిర్వహణలో నిర్లక్ష్యం లేదని, రోజువారీ పనులను పర్యవేక్షించే ప్లాంట్ మేనేజర్ ఇలంగోవన్ కూడా ఈ ప్రమాదంలో మరణించారని తెలిపింది. దర్యాప్తు పూర్తి కాకముందే నేరాన్ని ఆపాదిస్తూ అరెస్ట్, ప్రాసిక్యూషన్, క్రిమినల్ నేరం కింద చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేయకూడదని, కాబట్టి పిల్‌ను జరిమానాతో కొట్టివేయాలని కంపెనీ కోరింది.
