
దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆశ్వయుజ మాసం శుక్ష పక్షంలో నవమి తిథి రోజు అమ్మవారు మహిషాసుర మర్దనిగా అవతారం దాల్చుతుంది. మహిషుడిని సంహరించిన అమ్మ ఆపదల్లో మనకు అండగా ఉంటుంది. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేసి లోకం సుఖ శాంతులతో విలసిల్లే విధంగా కటాక్షించి కాపాడుతుంది. ఈరోజు అమ్మను సేవించడంవల్ల మన ఆపదలు, భయాలు అన్నీ తొలగుతాయి.
మహిషాసుర సంహారం,అంత సామాన్యం కాదు, మహిషాసురుడు బలమైన రాక్షసుడు... గొప్ప బలవంతుడు. మహిషాసురుడు తపః శక్తితో ఎన్నో వరాలు పొందాడు. అతనికున్న వర మహిమలు అతడిని ఇంకా బలవంతుడిగా చేశాయి. అసలే రాక్షస బుద్ది.. దేవతలు ఇచ్చిన వర బలంతో మూడు లోకాలను జయించి విజయ గర్వంతో తన ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించసాగాడు. దేవతలను, ఋషులను, మానవులను హింసించ సాగాడు. వరబలంతో మహిషాసురుడు చేసే అఘాయిత్యాలకు.. ఏమీ చేయలేక, భయంతో -బాధతో.. మునులు, దేవతలు, మానవులు త్రిమూర్తులను ( బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ) రక్షణ కల్పించమని వేడుకున్నారు.
దేవతలు, మునులు , మానవుల వేడుకోలుకు త్రిమూర్తులు కరిగిపోయారు. మహిషాసురుని మీద విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపం నుంచి ఓ తేజస్సు ( అంటే ఒక వెలుగు – ఒక శక్తి అని అర్ధం ) పుట్టింది. ఆ తరువాత ఆ శక్తికి ఒక రూపాన్ని ఇచ్చారు. దేవతల కోపము, ఆవేశముతో ఈ తేజో రూపం కలిసి మరింత శక్తివంతంగా రూపొంది. అదే .. ఆదిశక్తి గా... .అమ్మగా... స్త్రీ మూర్తిగా ఉద్భవించింది. ఆమే జగన్మాత అయిన ఆది పరాశక్తి... ఈ రూపాన్నే ... సర్వదేవతా స్వరూపం అంటారు...
దేవతలందరూ తమతమ శక్తిని, ఆయుధాలను జగన్మాతకు యిచ్చారు. శివుడు తన త్రిశూలాన్ని, శ్రీమహావిష్ణువు తన చక్రాన్ని, విశ్వకర్మ (ఈయన ఒక దేవత) ఒక పదునైన గొడ్డలిని ( పరశురాముని), ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, వాయుదేవుడు ధనుర్బాణాలను ఆ ఆదిపరాశక్తికి ఆయుధాలుగా యిచ్చారు.హిమవంతుడు సింహాన్ని వాహనంగా సమర్పించాడు. సింహాన్ని వాహనంగా చేసుకొని దేవలతు ఇచ్చిన ఆయుధాలను తీసుకొని వరుణుడు యిచ్చిన శంఖాన్ని పూరించింది.
ఆ శంఖ నాదశక్తికి తట్టుకోలేక రాక్షసులు తలక్రిందులయ్యారు. మహిషాసురుడు.. సింహరూపంలో ఉన్న దేవి తో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. ముందు ఖడ్గం, కత్తి చేపట్టి మానవ రూపంలోనూ యుద్ధం చేశాడు. మత్తగజంలా (బలమైన ఏనుగలా ) మారిన అమ్మ ను ముట్టడించబోయాడు. చివరకు తన సహజ రూపమైన దున్నపోతు ( మహిషం ) రూపంలో వాడి కొమ్ములతో అమ్మ మీద దాడి చేశాడు.
తన త్రిశూలంతో మహిషాసురుడి గుండెలు చీల్చిపారేసింది ఆ జగదాంబ. రాక్షసుడు చచ్చిపోయాడు, ఇది మహిషాసుర సంహార కథ. మహిషాసురుడు యుద్ద సమయంలో ఆరు రూపాలతో యుద్దం చేశాడు. 1) చండ 2) ముండ 3) శుంభ 4) నిశుంభ 5) దుర్గమాసుర 6) మహిషాసురులు .. ఈ ఆరుగురు రాక్షసులు రజో, తమో గుణాలకు ప్రతీకలు. సత్వ గుణానికి అధిదేవత అయిన జగన్మాత ఈ ఆరుగురు రాక్షసుల్ని సంహరించింది.
రజో, తమో గుణాల పైన సత్వ గుణము యొక్క విజయానికి ప్రతీక ఈ జగన్మాత విజయము. మహిషాసురమర్ధిని అమ్మవారు నవరాత్రులు తొమ్మిది అవతారాలలో దర్శనము ఇచ్చారు.అమ్మ దుష్ట శిక్షణకు త్రిమూర్తుల శక్తీ తో సహస్ర బాహువులతో సకలాభారనాలతో మహిషాసురుని వధించుటకు అమ్మ ఉగ్ర రూపము ధరించారు. అప్పుడు మహిశాసురుడును చంపివేసింది. అప్పుడు ఆమె రౌద్ర రూపాన్ని చూసి దేవతలు అందరు ఆమెను స్తుతించారు.
శంకారాచార్యులవారు మహిషాసుర మర్ధిని స్తోత్రాన్ని పాడారు అది మంచిగా గుర్తింపు ఉన్న పాటగా రూపొందింది. నవరాత్రుల తరువాత రోజు మహిషాసుర మర్ధిని స్తోత్రము చదువుతారు. ఇది అమ్మవారి అతి ఉగ్రమైన రూపం, అశ్వయుజశుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాసురమర్ధినిగా అవతరించి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసింది.
ధర్మ విజయానికి సంకేతంగా అశ్వయుజ శుద్ధనవమినే మహార్నవమి గా భక్తులు ఉత్సవం జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించి, అమ్మ సకల దేవతల అంశలతో మహా శక్తిగా ఈ రోజు దర్శనం ఇస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడిని వధించిన అమ్మను ఈ దినాన పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది.
ఈ రోజున ప్రత్యేకంగా చండీ సప్తశతి హోమం చేస్తారు. అమ్మవారికి "ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహినైస్వాహా” అనే మంత్రాన్ని జపించడం మంచిది అని పురాణాల ద్వారా తెలుస్తుంది.