V6 News

బీపీ, షుగర్ లేకున్నా కిడ్నీ క్యాన్సర్..లక్షణాలు లేకున్నా కిడ్నీలో 8 సె.మీ గడ్డ

బీపీ, షుగర్ లేకున్నా కిడ్నీ క్యాన్సర్..లక్షణాలు లేకున్నా కిడ్నీలో 8 సె.మీ గడ్డ
  •  డాక్టర్ల అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం  

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకున్నా నార్మల్ హెల్త్ చెకప్​లో ఓ వ్యక్తికి కిడ్నీ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. దీంతో డాక్టర్ల చికిత్సతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. సిటీకి చెందిన 42 ఏండ్ల వ్యక్తికి ఎలాంటి అనారోగ్య సమస్యలు (బీపీ, షుగర్) లేవు. స్మోకింగ్ కూడా చేయడు.

ఇటీవల సాధారణ మాస్టర్ హెల్త్ చెకప్​లో భాగంగా అబ్డామినల్ అల్ట్రాసౌండ్ పరీక్షలో ఎడమ కిడ్నీలో 8 సెంటీమీటర్ల గడ్డ (మాస్) ఉన్నట్టు తేలింది. సీటీ స్కాన్ చేయగా, కిడ్నీ క్యాన్సర్​గా నిర్ధారణ అయింది. దీంతో ఏషియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ డిపార్ట్​మెంట్​హెచ్​ఓడీ డాక్టర్ శ్రీనివాస నారాయణం నేతృత్వంలో సర్జరీ చేసి కిడ్నీనే తొలగించారు. ఇప్పుడు రోగి కొలుకుని ఆరోగ్యం గా ఉన్నాడు.  

మూత్రంలో రక్తం.. నడుం నొప్పి

కిడ్నీ సమస్యలపై డాక్టర్ శ్రీనివాస నారాయణం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 4.3 లక్షల కొత్త కిడ్నీ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, 70 నుంచి 80 శాతం కిడ్నీ కణతులు ఎలాంటి లక్షణాలు లేకుండానే పెరుగుతాయన్నారు. మూత్రంలో రక్తం రావడం, నడుము నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వ్యాధి ముదిరినట్లు గుర్తించాలన్నారు. అందుకే ముందస్తు పరీక్షలు ముఖ్యమన్నారు.

డయాబెటిస్, బీపీ ఉన్నవారికి, పొగ తాగేవారికి క్యాన్సర్​వచ్చే ముప్పు ఎక్కువన్నారు.  కొందరిలో వంశపారంపర్యంగా కూడా రావచ్చన్నారు. చిన్న గడ్డలైతే కిడ్నీని కాపాడుతూ తొలగించవచ్చని, పెద్ద గడ్డలైతే కిడ్నీ తొలగించాల్సి ఉంటుందన్నారు. ఏడాదికి ఒకసారి కనీసం అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోవడం వల్ల ఇలాంటి సైలెంట్ కిల్లర్స్ నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు.