ఏ క్షణమైనా శుభవార్త .. ఫైనల్ స్టేజ్​లో ఉత్తరాఖండ్​ టన్నెల్​ రెస్క్యూ పనులు

ఏ క్షణమైనా శుభవార్త .. ఫైనల్ స్టేజ్​లో ఉత్తరాఖండ్​ టన్నెల్​ రెస్క్యూ పనులు
  • టన్నెల్ లోపల ఎన్డీఆర్‌ఎఫ్​ టీమ్​.. బయట అంబులెన్స్​లు రెడీ...

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్​లోని టన్నెల్​లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఫైనల్ స్టేజికి చేరుకుంది. ఏ క్షణంలోనైనా శుభవార్త ప్రకటించ వచ్చని  బుధవారం అర్ధరాత్రి అధికారులు తెలిపారు. డ్రిల్లింగ్ పనులు తుది దశకు చేరుకోవడంతో 15 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్​ టీమ్​ టన్నెల్ లోకి ఎంటర్ అయింది. తవ్వకం పూర్తయితే కూలిన భాగంలోకి వెళ్లి, అక్కడున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు వారు సిద్దమయ్యారు. ఇలా తీసుకొచ్చిన వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు బయట 41 అంబులెన్స్ లను అధికారులు సిద్ధంగా ఉంచారు. దీంతోపాటు టన్నెల్​కు దగ్గర్లోనే తాత్కాలికంగా 41 బెడ్లతో ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.

బుధవారం ఊపందుకున్న రెస్క్యూ..

కార్మికులను కాపాడేందుకు చేపట్టిన రెస్క్యూ పనులు బుధవారం ఊపందుకున్నాయి. డ్రిల్లింగ్ పనులు వేగంగా జరిగాయి. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు సిల్క్యారా వైపు నుంచి సమాంతరంగా డ్రిల్లింగ్ మొదలుపెట్టగా, సాయంత్రం 6 గంటల వరకు  45 మీటర్ల మేర పూర్తయింది. ‘‘ఈ విషయం ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. మేం టన్నెల్​లో మరింత ముందుకెళ్లాం. మరో 6 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయింది. ఇంకో 12 మీటర్లు ముందుకెళ్తే డ్రిల్లింగ్ మొత్తం పూర్తయిపోతుంది. మేం లాస్ట్ ఫేజ్ లో ఉన్నాం. అది కూడా పూర్తి చేసి, కార్మికులను బయటకు తీసుకొస్తాం” అని ఉత్తరాఖండ్ ఓఎస్డీ భాస్కర్ ఖుల్బే తెలిపారు. అంతకుముందు, నేషనల్ హైవేస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ హెచ్ఐడీసీఎల్) ఎండీ మహ్మద్ అహ్మద్ మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి నుంచి డ్రిల్లింగ్ పనులు మళ్లీ మొదలుపెట్టామని చెప్పారు.  

కార్మికులకు ఆహారం, బట్టలు..

కార్మికులకు ఆహారం, బట్టలు అందజేస్తున్నామని ఉత్తరాఖండ్  ప్రభుత్వం తెలిపింది. ఇటీవల ఏర్పాటు చేసిన పెద్ద పైపులైన్ ద్వారా రోటీ, సబ్జీ, కిచిడీ, ఆరెంజెస్, అరటిపండ్లు, టీషర్ట్స్, టవల్స్, అండర్ వేర్స్, టూత్ పేస్ట్ తదితర వస్తువులు పంపించామని చెప్పింది. కాగా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామికి బుధవారం మరోసారి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సహాయక చర్యలపై ఆరా తీశారు.

రెస్క్యూ పనుల్లో రెండు రోబోలు..

ఉత్తరాఖండ్ లో 11 రోజులుగా రెస్క్యూ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడీ ఆపరేషన్ లో రెండు రోబోలు కూడా చేరాయి. రెస్క్యూ టీమ్ విజ్ఞప్తి మేరకు దక్ష్ మినీ, దక్ష్ స్కౌట్ అనే రెండు రోవర్లను డీఆర్ డీవో పంపించింది. వీటి ప్రత్యేకత ఏంటంటే.. ఇవి రెండు కూడా పోర్టబుల్ డివైజెస్. వీటిని చాలా తక్కువ స్థలంలోనూ ఆపరేట్ చేయొచ్చు. దక్ష్​ మినీని బరువులు ఎత్తడానికి వినియోగిస్తారు. ఇది 20 కిలోల వరకు ఎత్తగలదు. ఇక దక్ష్ స్కౌట్ ను సర్వైలెన్స్ కోసం డిజైన్ చేశారు. ఇది ఎలాంటి ప్రదేశంలోనైనా పని చేయగలదు. దీనికి 360 డిగ్రీ వ్యూ కెమెరాలు ఉంటాయి.

టన్నెల్ దగ్గర్లోనే టెంపరరీ హాస్పిటల్..

టన్నెల్ నుంచి బయటకు తీసుకువచ్చిన వెంటనే కార్మికులకు ట్రీట్ మెంట్ అందించేందుకు చిన్యాలిసౌర్​లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ప్రత్యేకంగా 41 బెడ్లతో హాస్పిటల్ ను అధికారులు సిద్ధం చేశారు. సిల్క్యారావైపు టన్నెల్ వద్ద 30 అంబులెన్స్ లను కూడా సిద్ధంగా ఉంచారు. డ్రిల్లింగ్ పనులు చివరి దశకు చేరుకోవడంతో హెల్త్, రెస్క్యూ స్టాఫ్ ను అంతా అలర్ట్​గా ఉంచామని అధికారులు తెలిపారు. టన్నెల్ వద్ద మందులు, ఇతర అత్యవసర ఎక్విప్ మెంట్ అంతా కూడా సిద్ధంగా ఉంచుకున్నట్లు చెప్పారు. కాగా, టన్నెల్​లో చిక్కుకున్న వారిలో 15 మంది జార్ఖండ్ వాసులు ఉన్నారు. వీరిని హెలికాప్టర్ ద్వారా సొంత రాష్ట్రానికి తరలించేందుకు జార్ఖండ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.