
సింగపూర్: ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్. ఎస్. ప్రణయ్.. సింగపూర్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. మంగళవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 21–14, 21–9తో వెన్ యు జాంగ్ (కెనడా)పై గెలిచింది. 31 నిమిషాల ఆటలో తెలుగమ్మాయి బలమైన స్మాష్‌లు, ర్యాలీలతో ప్రత్యర్థికి ఈజీగా చెక్ పెట్టింది. ఇతర మ్యాచ్‌ల్లో మాళవిక బన్సోద్ 21–14, 18–21, 11–21తో సుపానిదా కటెతోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో, అన్మోల్ కర్బ్ 11–21, 22–24తో చెన్ యు ఫి (చైనా) చేతిలో ఓడారు. మెన్స్ సింగిల్స్‌లో ప్రణయ్ 19–21, 21–16, 21–14తో రాస్మస్ గెమ్కే (డెన్మార్క్)పై పోరాడి నెగ్గాడు. కానీ, ప్రియాన్షు రజావత్ 21–14, 10–21, 14–21తో కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓడిపోయాడు.
కిరణ్ జార్జ్ 19–21, 17–21తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో, సంతోష్ 14–21, 8–21తో కిమ్ గా యున్ (సౌత్ కొరియా) చేతిలో ఓడి ఇంటిదారి పట్టారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో 18–21, 13–21తో చెంగ్ జియాంగ్–జాంగ్ చి (చైనా) చేతిలో, అశిత్ సూర్య–అమృతా 11–21, 17–21తో యుయి షిమోగమి–సయకా హోబరా (జపాన్) చేతిలో కంగుతిన్నారు. విమెన్స్ డబుల్స్‌లో కవిప్రియ సెల్వం–సిమ్రన్ సింగ్ 4–21, 9–21తో బీక్ హ నా– లీ సో హీ (కొరియా) చేతిలో పరాజయం చవిచూశారు.