హైదరాబాద్, వెలుగు: బ్రెజిల్‌లో చేపట్టబోయే లిథియం మైనింగ్‌లో తమతో కలిసి పని చేయాలని కోరుతూ ఆ దేశానికి చెందిన సీబీఎల్ సంస్థ ప్రతినిధులు సింగరేణి సంస్థను కోరారు. ఈ మేరకు బుధవారం సింగరేణి సీఎండీ బుద్ద ప్రకాశ్ జ్యోతిని కలిశారు. కంపాన్హియా బ్రసిలీరా డి లిటియో (సీబీఎల్) కంపెనీ సీఈవో వినీసియస్ అల్వారెంగా, బోర్డు డైరెక్టర్ డేనియల్ లెమే.. సింగరేణి సీఎండిని కలిసి చర్చలు జరిపారు.
బ్రెజిల్‌లో ఇప్పటికే తాము లిథియం మైనింగ్ చేపట్టామని, సింగరేణి సంస్థ కీలక ఖనిజాల పట్ల ఆసక్తితో ఉన్న నేపథ్యంలో తమ కంపెనీలో భాగస్వామిగా చేరితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వారు వివరించారు. తాము సింగరేణితో పాటు దేశంలోని ప్రముఖ కంపెనీలను కూడా సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచంలో లిథియం ఖనిజానికి ఉన్న ప్రాధాన్యత, వ్యాపార కోణంలో ఉన్న లాభం గురించి వివరించారు.
