
- రూ.20 వేల లాభాల వాటా చెల్లించండి
- డిప్యూటీ సీఎం భట్టికి సింగరేణి కాంట్రాక్ట్ జేఏసీ వినతి
- సింగరేణి సీఎండీ బలరాంతో కలిసి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో చర్చలు
- సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి వివేక్
హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో వేతనాలు పెంచాలని, లాభాల వాటా రూ.20 వేలు చెల్లించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కోరింది. శుక్రవారం జేఏసీ నాయకత్వంలో వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు వచ్చి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిప్రతం ఇచ్చారు. సింగరేణి కార్మికులకు మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, గుమ్మడి నరసయ్య మద్దతుగా వచ్చారు.
సింగరేణిలో తమ శ్రమతోనే లాభాలు వస్తున్నాయని, అయినా యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నదని కాంట్రాక్ట్ కార్మికులు పేర్కొన్నారు. కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికులకు రోజుకు రూ.1,285 చెల్లిస్తుంటే, సింగరేణిలో కేవలం రూ.541 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. దీంతో ప్రతి కార్మికుడు రోజుకు రూ.744, నెలకు రూ.19,344 నష్టపోతున్నారని వివరించారు. సెలవులు, వైద్య సదుపాయాలు, ప్రమాద ఎక్స్‌గ్రేషియా అమలు చేయడం లేదని, రూ.20 వేల లాభాల వాటా చెల్లించాలని కోరారు. కార్మికుల శ్రమను గుర్తించి, వేతనాల పెంపు, లాభాల వాటా పెంపు, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
సమస్యలపై చర్చిస్తాం: మంత్రి వివేక్
ప్రొఫెసర్ కోదండరామ్‌తో కలిసి సింగరేణి జేఏసీ నేతలు..కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని, సింగరేణి సీఎండీ ఎన్. బలరాంను కలిశారు. కనీస వేతనాల జీవోపై చర్చించారు. త్వరలోనే రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచుతామని, సింగరేణిలో అదనపు వేతనాలపై చర్చిస్తామని, మిగిలిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం వేతనాలు అమలు చేస్తామని, ఈఎస్‌ఐ అమలు, పెయిడ్ హాలిడేస్, 15 లక్షల నష్టపరిహారం, కేటగిరీ ఆధారంగా వేతనాలు వంటి అంశాలు త్వరలో పరిష్కరిస్తామని సీఎండీ బలరాం తెలిపారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం, జేఏసీ నాయకులు బీ మధు, యాకూబ్ షావలీ, కరుణాకర్, యాకయ్య, బాబు, మల్లెల రామనాథం, రామ్‌సింగ్, భూక్యా రమేశ్, వేల్పుల కుమారస్వామి, తదితరులున్నారు.