హైదరాబాద్, వెలుగు: కరోనా సమయంలో లేదా ఇతర స్థానిక కారణాల వల్ల విధులకు హాజరుకాకుండా ఉద్యోగాల నుంచి డిస్మిస్ అయిన కార్మికులను వన్ టైం ఆప్షన్ కింద తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి సంస్థ ఆఫీసర్లను ఆదేశించారు. విధులు నిర్వహించకుండా సమ్మెకు పిలుపునిచ్చిన లేదా సమ్మెలో పాల్గొన్న అధికారులపై, దానికి నాయకత్వం వహించిన వారిపై "నాన్ మెయింటెనెన్స్ ఆఫ్ డ్యూటీస్" కింద హెచ్చరిక జారీ చేయాలని స్పష్టం చేశారు.
మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో సింగరేణి ప్రాంత మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకట స్వామి, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, మట్టా రాగమయి, కోరం కనకయ్య, మాలోతు రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, కూనంనేని సాంబశివరావు, గండ్ర సత్య నారాయణ రావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, గడ్డం వినోద్ వెంకటస్వామి, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్, సంస్థ ఉన్నతాధికారులతో భట్టి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన పలు విజ్ఞప్తులను ప్రజా ప్రతినిధులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకురాగా, వాటన్నింటినీ సానుకూలంగా విని తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
నెలకోసారి బోర్డు మీటింగ్
మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం కార్మికులు కొత్తగూడెం వరకు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా, సింగరేణి పరిధిలోని అన్ని ఏరియా ఆస్పత్రుల్లో ప్రతి నెలా బోర్డు మీటింగ్ నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సుమారు 300 డిపెండెంట్ ఆర్డర్‌లను, ఇతర లీగల్ ప్రాసెస్‌లను రాబోయే 15 రోజుల్లో పూర్తిచేసి అభ్యర్థులకు అందజేయాలని సూచించారు.
డిపెండెంట్ ఉద్యోగుల పేర్ల మార్పులకు సంబంధించి సుమారు 136 మంది పెండింగ్ సమస్యలను అధికారులు మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కరించాలన్నారు. దీని కోసం ఏర్పాటు చేసిన సింగరేణి ఆఫీసర్స్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
రామగుండం సింగరేణి థర్మల్ ప్లాంట్ పనులకు గ్రీన్ సిగ్నల్
రామగుండంలో సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన పనులకు డిప్యూటీ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సింగరేణి ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న 1,250 ఎకరాల్లో జీవో నంబర్ 76 ప్రకారంగా అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. బొగ్గు గనులు, ఓవర్ బర్డెన్ డంప్‌ల దుమ్ము వల్ల స్థానిక ప్రజలలో క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని పలు అధ్యయనాలు తెలుపుతున్నందున.. సింగరేణి పరిధిలోని పాత జిల్లాల్లో ప్రతి గ్రామానికి వెళ్లి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
సింగరేణి పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి సోలరైజ్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. ఊరి బయట నిరుపయోగంగా ఉన్న భూములు, ఓవర్ బర్డెన్ గుట్టలను సోలార్ ప్లాంట్లకు ఉపయోగించాలని స్పష్టం చేశారు.
