కొత్త గనుల కోసం సింగరేణి ప్రయత్నాలు

కొత్త గనుల కోసం సింగరేణి ప్రయత్నాలు
  • బ్లాక్‌‌‌‌ల కేటాయింపునకు వేలం నిర్వహించనున్న కేంద్ర బొగ్గు గనుల శాఖ
  • వేలంలో పాల్గొనాలని సింగరేణికి సర్కార్‌‌‌‌ ఆదేశం
  • మూడు ఓసీపీలు, ఓ అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ మైన్‌‌‌‌ దక్కించుకునేలా ప్లాన్‌‌‌‌
  • ఆయా ప్రాంతాల్లో 1,400 మిలియన్‌‌‌‌ టన్నుల ఒగ్గు నిక్షేపాలు

కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌, వెలుగు : కేంద్రం నిర్వహించే వేలంలో పాల్గొని కొత్త బొగ్గు బ్లాక్‌‌‌‌లను దక్కించునేందుకు సింగరేణి సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. బ్లాక్‌‌‌‌లకు సంబంధించిన వేలంలో పాల్గొనాలని సింగరేణికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో తాడిచెర్ల- 2, సత్తుపల్లి, శ్రావణపల్లి ఓసీపీతో పాటు కేకే 6 అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ మైన్‌‌‌‌ను దక్కించుకునేందుకు చర్యలు చేపట్టింది.

1400 మిలియన్‌‌‌‌ టన్నుల నిక్షేపాలు

సింగరేణిలోని అన్ని ఏరియాలకు సమీప ప్రాంతాల్లో మరో 1400 మిలియన్‌‌‌‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు సంస్థ గుర్తించింది. వీటిని నేరుగాగానీ, లేదంటే వేలంలోగానీ దక్కించుకుంటే మరో రెండు దశాబ్దాల పాటు ఉత్పత్తికి ఢోకా ఉండదని యాజమాన్యం భావిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్‌‌‌‌ బొగ్గు బ్లాక్‌‌‌‌ల వేలంలో పాల్గొనేందుకు సానుకూలంగా ఉన్నట్లు ఇటీవల సీఎండీ బలరాంనాయక్‌‌‌‌ వెల్లడించారు.

 నేరుగా కేటాయిస్తే 14 శాతం రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే వేలంలో పాల్గొంటే తక్కువ ధరకే బొగ్గు బ్లాక్‌‌‌‌లను దక్కించుకునే ఛాన్స్‌‌‌‌ ఉండడంతో పాటు, రాయల్టీ సమస్య కూడా ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సింగరేణి సమీప ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి వ్యయం ఎక్కువ అవుతుందన్న కారణంతో ప్రైవేట్‌‌‌‌ కంపెనీలు పోటీ పడే ఛాన్స్‌‌‌‌ తక్కువగా ఉండగా, భారీ ఆధునిక యంత్రాలు, రవాణా సదుపాయాలు, మ్యాన్‌‌‌‌ పవర్‌‌‌‌ ఉండడం సింగరేణికి కలిసొచ్చే అంశం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

గత ప్రభుత్వంలో నో పర్మిషన్‌‌‌‌

సింగరేణి ప్రాంతాల్లో ఉన్న గనులకు గతంలో సదసు సంస్థే పూర్తి హక్కుదారుగా ఉండేది. కేవలం ఎన్విరాన్‌‌‌‌మెంట్‌‌‌‌తో పాటు గనుల తవ్వకానికి సంబంధించిన పర్మిషన్‌‌‌‌ మాత్రమే పొందాల్సి ఉండేది. కేంద్ర ప్రభుత్వం మైన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ మినిరల్స్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ రెగ్యులేషన్‌‌‌‌ చట్టం తీసుకురావడంతో ఏ సంస్థ అయినా వేలం ద్వారానే కొత్త బొగ్గు గనులను దక్కించుకోవాల్సి వచ్చింది. అయితే బొగ్గు బ్లాక్‌‌‌‌ల వేలంలో పాల్గొనేందుకు సింగరేణి సంస్థకు గత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం పర్మిషన్‌‌‌‌ ఇవ్వలేదు. గనుల విస్తరణకు కూడా పర్మిషన్లు రాలేదు. దీంతో ప్రస్తుతం సింగరేణి వద్ద ఉన్న బొగ్గు నిల్వలు 2 దశాబ్దాల్లోగా ఖాళీ అవుతాయని అంచనా.

 ఐదు బ్లాక్‌‌‌‌లపై ఆశలు

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేలంలో పాల్గొని సత్తుపల్లి, శ్రావణపల్లి ఓసీపీలు, కేకే- 6 అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ బొగ్గు బ్లాక్‌‌‌‌లను దక్కించుకోవడంపై సింగరేణి దృష్టి పెట్టింది. భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల- 2 బ్లాక్‌‌‌‌ను సింగరేణికే కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిని కలిసి విన్నవించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించడంతో తాడిచెర్ల 2 గనిపై ఆశలు నిలిచాయి. 1,875.84 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ గని ప్రాంతంలో 1,597.01 హెక్టార్ల అటవీ భూమి ఉంది. గనిలో మొత్తం 205.97 మిలియన్‌‌‌‌ టన్నుల బొగ్గు ఉన్నట్లు గుర్తించారు. 

ఏటా 5 మిలియన్‌‌‌‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే ఛాన్స్‌‌‌‌ ఉంది. గనికి పర్యావరణ పర్మిషన్లు కూడా వచ్చాయి. 2013లోనే తాడిచెర్ల 2 బ్లాక్​ను కేటాయించినా అప్పటి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌ పర్మిషన్లు తీసుకోలేదు. మరోవైపు సింగరేణి పరిధిలోని కోయగూడెం ఓసీపీ 3 గనికి వేలం నిర్వహించగా ఓ ప్రైవేట్‌‌‌‌ కంపెనీ దక్కించుకుంది. ఈ ప్రాంతంలో పూర్తిగా గిరిజన తెగలు నివసిస్తుండడంతో ప్రైవేట్‌‌‌‌ సంస్థలు బొగ్గును వెలికితీసే ధైర్యం చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ సింగరేణికి కేటాయించాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖకు రాష్ట్ర సర్కార్‌‌‌‌ లెటర్‌‌‌‌ రాయడంతో ఆ బ్లాక్‌‌‌‌ కూడా దక్కుతుందనే ఆశలు పెరిగాయి. 

పెరగనున్న ఉత్పత్తి, ఉపాధి

వేలం ద్వారా బ్లాక్‌‌‌‌లు దక్కించుకుంటే సింగరేణి బొగ్గు ఉత్పత్తి 100 మిలియన్‌‌‌‌ టన్నులకు పైగా పెరగడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరకనుంది. ఇదే విషయాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌‌‌ వెంకటస్వామితో పాటు కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌కు చెందిన ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సింగరేణిని వేలంలో పాల్గొనేలా ఒప్పించారు.