ఆర్టీసీ డ్యూటీలకు సింగరేణి ఉద్యోగులు

ఆర్టీసీ డ్యూటీలకు సింగరేణి ఉద్యోగులు
  •                 నలుగురిని డిప్యుటేషన్​పై పంపిన మేనేజ్​మెంట్
  •                 మంచిర్యాల డిపోలో పనిచేయాలని ఆదేశం
  •                 ప్రభుత్వ తీరు సరికాదంటూ కార్మిక సంఘాల ఆగ్రహం
  •                 రేపు సింగరేణిలోనూ ఇలాగే చేయొచ్చని ఆందోళ

 

సింగరేణి నలుగురు బొగ్గు గని కార్మికులను ఆర్టీసీలో పనిచేసేందుకు డిప్యుటేషన్​పై పంపింది. శ్రీరాంపూర్‌‌ డివిజన్‌‌కు చెందిన ఇద్దరు మోటార్‌‌ మెకానిక్‌‌లు, ఒక ఎలక్ట్రీషియన్, ఒక జనరల్‌‌ మజ్దూర్‌‌ను మంచిర్యాల ఆర్టీసీ డిపోలో రిపోర్టు చేయాలంటూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో.. డిపోల్లో పనిచేసేందుకు సింగరేణి కార్మికులను పంపడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

సమ్మె ఉధృతం కావడంతో..

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించిన సర్కారు.. సింగరేణి ప్రాంతాల్లోని ఆర్టీసీ డిపోల్లో సింగరేణి ఉద్యోగుల చేత విధులు నిర్వహించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. గురువారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ ఏరియా సింగరేణి వర్క్​షాపుకు చెందిన ఎలక్ట్రీషియన్​ ఎ.రాజమల్లు, మోటార్​ మెకానిక్​లు బి.అనిల్​కుమార్, పి.వినోద్,  జనరల్​ మజ్దూర్​ ఎ.రాజ్​కుమార్​లను డిప్యుటేషన్​పై మంచిర్యాల ఆర్టీసీ డిపోకు పంపుతూ డీజీఎం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తున్నారనే ఉద్దేశంతోనే సింగరేణి కార్మికులను ఇలా డిప్యుటేషన్​పై పంపుతున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలా డిప్యుటేషన్​పై ఇతర సంస్థల్లోకి పంపడం ఇదే మొదటిసారని, ఇది రూల్స్​కు విరుద్ధమని పేర్కొంటున్నాయి. సమ్మెను విచ్చిన్నం చేసేందుకు ఇతర సంస్థల కార్మికులను వినియోగించుకోవడం హక్కులను కాలరాయడమేనని.. సింగరేణి ఉద్యోగుల్లో చిచ్చు పెడుతున్నారని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్​ సెక్రెటరీ బాజీ సైదా, బీఎంఎస్​ రీజియన్​ ఇన్​చార్జి పేరం రమేష్​, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి నర్సింహరావు అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సింగరేణిలో సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఇరిగేషన్‌‌ ఉద్యోగులకూ..

నీటిపారుదల శాఖ, రోడ్లు, భవనాల శాఖ, డీసీసీబీ, హార్టికల్చర్‍, లేబర్ డిపార్ట్‌‌మెంట్‌‌లో పనిచేస్తున్న ఉద్యోగులను ఆర్టీసీలో డ్యూటీలకు కేటాయిస్తూ ఖమ్మం కలెక్టర్ కర్ణన్ గురువారం ఉత్తర్వులిచ్చారు. జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న 20 మంది ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఇతర అధికారులకు ఆర్టీసీ విధులను అప్పగించారు.