జియో థర్మల్‌‌‌‌ పవర్​పై సింగరేణి ఫోకస్​

జియో థర్మల్‌‌‌‌ పవర్​పై సింగరేణి ఫోకస్​
  • ఉబికి వచ్చే వేడినీటి ఆవిరితో కరెంట్​ ఉత్పత్తి
  •     మణుగూరులో ఇప్పటికే 20 కిలో వాట్ల ప్లాంట్​ సక్సెస్​
  •     అక్కడే 122 మెగావాట్ల జియో థర్మల్ ప్లాంట్​ ఏర్పాటుకు సన్నాహాలు
  •     తాజాగా ఓఎన్జీసీ, రెడ్​కోతో  సింగరేణి ఎంఓయూ
  •     కొత్తరకం విద్యుత్ ​ఉత్పత్తికి వేదిక కానున్న రాష్ట్రం

హైదరాబాద్, వెలుగు : భూగర్భం నుంచి సహజసిద్ధంగా లభించే వేడినీటి ఆవిరితో కరెంట్​ ఉత్పత్తిపై సింగరేణి సంస్థ దృష్టి సారించింది.  సాంప్రదాయేతర ఇంధన వనరుల అన్వేషణలో భాగంగా జియో థర్మల్‌‌‌‌ కేంద్రాల  ఏర్పాటుకు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ భాగస్వామ్యంతో భారీ జియో థర్మల్‌‌‌‌ ప్లాంట్లను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు కేంద్రంగా జియో థర్మల్‌‌‌‌ కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో విజయవంతమైతే దేశంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించనున్నది. ఇప్పటికే మణుగూరు సమీపంలోని పగిడేరు వద్ద ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన 20 కిలోవాట్ల జియో థర్మల్‌‌‌‌ విద్యుత్తు కేంద్రం సక్సెస్​అయ్యింది. 

ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడానికి ఇటీవల ఒప్పందాలు జరిగాయి. మణుగూరుకు సమీపంలో పగిడేరు వద్ద భూగర్భంలో విస్తారంగా ఉన్న జియో థర్మల్‌‌‌‌ క్షేత్రం అన్వేషణ, అభివృద్ధిపై సింగరేణి కాలరీస్‌‌‌‌ కంపెనీ, ఆయిల్‌‌‌‌ అండ్‌‌‌‌ నేచురల్‌‌‌‌ గ్యాస్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌(ఓఎన్జీసీ), తెలంగాణ రెన్యువబుల్‌‌‌‌ ఎనర్జీ కార్పొరేషన్‌‌‌‌ రెడ్​కో (టీజీ రెడ్​కో)  మధ్య ట్రైపార్టీ అగ్రిమెంట్​ జరిగింది. ఒప్పందం ప్రకారం మణుగూరు ప్రాంతంలో జియో థర్మల్‌‌‌‌ విస్తరించి ఉన్న భూ అంతర్‌‌‌‌ భాగంలో ఓఎన్జీసీ పరిశీలన, అన్వేషణ చేస్తుంది. రెడ్‌‌‌‌కో నోడల్‌‌‌‌ సంస్థగా ప్రభుత్వాలు, చట్టబద్ధ సంస్థల నుంచి అనుమతులు పొందడానికి సహకారం అందిస్తుంది. సింగరేణి సంస్థ లాజిస్టికల్‌‌‌‌ సపోర్ట్ అందజేస్తుంది. ఇక్కడ 122 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని సింగరేణి టార్గెట్​​గా పెట్టుకున్నది.

ప్లాంట్ దిశగా అడుగు పడింది ఇలా..

సింగరేణి సంస్థ తన సొంత అవసరాల కోసం మణుగూరు సమీపంలోని పడిగేరు వద్ద నాలుగు బోర్లు వేసింది. ఈ బోర్ల నుంచి భారీ గా వేడి నీరు ఉబికి రావడం అధికారులు గుర్తించారు. ఈ 4 బోరు బావుల నుంచి 65 నుంచి 80 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన వేడి నీరు భూమి నుంచి బయటకు ఉబికి వచ్చి రాగానే వాటంతటవే ఆవిరవుతున్నాయి. ఈ నేపథ్యంలో వేడి నీటి నుంచి కరెంటు ఉత్పత్తి చేయొచ్చని గుర్తించిన అధికారులు.. దీనిపై అధ్యయనం చేయించారు. ఈ నీరు కనీసం 20 ఏండ్లపాటు లభ్యమవుతుందని నిపుణులు అంచనా వేశారు. బొగ్గును మండించి, నీటిని వేడి చేసి విద్యుత్​ ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేకుండా ఏకంగా వేడి నీరు లభ్యమవుతున్న మణుగూరు ప్రాంతం నుంచి జియో థర్మల్​ ప్లాంట్​ ద్వారా విద్యుత్​ ఉత్పత్తి చేయొచ్చని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో జియో థర్మల్‌‌‌‌ పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 

మణుగూరు సమీపంలోనే ఎక్కువ అవకాశాలు 

దేశవ్యాప్తంగా ఇలా వేడినీరు ఉబికి వచ్చే  పది భూతాప ప్రాంతాల్లో 381 ఇలాంటి ప్రదేశాలను గుర్తించారు. అయితే, మణుగూరు భూతాప క్షేత్రం అ త్యంత ఆశాజనకంగా ఉంది.  దేశంలోని ఇతర ప్రాంతాలను పోల్చితే మణుగూరులో  తక్కువ పెట్టుబడితో జియో థర్మల్​ ఎనర్జీ జనరేషన్​ సాధ్యమని తేలింది.  పగిడేరుకు అతి సమీపంలో ఉన్న భద్రాద్రి థర్మల్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ గ్రిడ్‌‌‌‌ కు కనెక్ట్​ చేయడానికి వీలుంటుంది. ఇప్పటికే నిర్వహించిన పరిశోధనల్లో మణుగూరు ప్రాంతంలో 3,500 మెగావాట్ల విద్యుత్‌‌‌‌ ఉత్పత్తికి అవకాశం ఉన్నట్టు తేలింది. ఓఎన్జీసీ, సింగరేణి, రెడ్​కో తాజా ఒప్పందంతో మణుగూరులో ఎంత కరెంటు ఉత్పత్తి చేయవచ్చనే వాస్తవ అవకాశాలను తేల్చడానికి తాజా అన్వేషణ దోహదపడనున్నది. 

122 మెగావాట్ల ప్లాంట్

మణుగూరులో 122 మెగావాట్ల జియో థర్మల్‌‌‌‌ విద్యుత్‌‌‌‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అవకాశం ఉందని జియోలాజికల్‌‌‌‌ సర్వే ఆఫ్‌‌‌‌ ఇండియా నివేదిక వెల్లడించింది. ఇక్కడ జియో థర్మల్‌‌‌‌ విద్యుత్‌‌‌‌ ఉత్పత్తికి పూర్తి అనువైన వాతావరణం ఉన్నదని వెల్లడించింది. ఈ దిశగా అడుగులు ముందుకు పడుతుండడంతో మణుగూరు దేశంలో అతిపెద్ద జియో థర్మల్‌‌‌‌కేంద్రంగా మారనున్నది. మరింత అన్వేషణ జరిగితే జియో థర్మల్‌‌‌‌ విద్యుత్‌‌‌‌ ఉత్పత్తే కాకుండా హీలియం వెలికితీసేందుకు కూడా అవకాశాలున్నాయి. ఇప్పటికే సింగరేణి, టీజీ రెడ్‌‌‌‌కో క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించాయి. క్లీన్‌‌‌‌ ఎనర్జీని ప్రోత్సహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రం మరో కొత్తరకం విద్యుత్​ ఆవిష్కరణకు వేదిక కానున్నది.