రాష్ట్రంలో19 బిలియ‌‌న్ క్యూబిక్ మీట‌‌ర్ల కోల్ బెడ్ మిథేన్ గ్యాస్ : డైరెక్టర్ జ‌‌న‌‌ర‌‌ల్ స‌‌చివ్ కుమార్

రాష్ట్రంలో19 బిలియ‌‌న్ క్యూబిక్ మీట‌‌ర్ల కోల్ బెడ్ మిథేన్ గ్యాస్ : డైరెక్టర్ జ‌‌న‌‌ర‌‌ల్ స‌‌చివ్ కుమార్
  •     అన్వేష‌‌ణ‌‌కు సింగ‌‌రేణికి అవ‌‌కాశం
  •     వేలంలో పాల్గొనాల్సిందిగా కేంద్రం నుంచి ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 19 బిలియ‌‌న్ క్యూబిక్ మీట‌‌ర్ల కోల్ బెడ్ మిథేన్ గ్యాస్​ వనరులు ఉన్నట్లుగా కేంద్ర పెట్రోలియం, సహజ వ‌‌న‌‌రుల మంత్రిత్వ శాఖ అడిష‌‌న‌‌ల్ డైరెక్టర్ జ‌‌న‌‌ర‌‌ల్ స‌‌చివ్ కుమార్ తెలిపారు. ఈ గ్యాస్​ వనరుల అన్వేషణ కోసం కేంద్రం వేసే వేలంలో పాల్గొనాల్సిందిగా ఆయన సింగరేణి సంస్థకు ఆహ్వానం అందించారు. 

శుక్రవారం హైదరాబాద్‌‌లోని సింగరేణి భవన్‌‌లో ఆ సంస్థ సీఎండీ బుద్ధ ప్రకాశ్‌‌ జ్యోతితో ఆయన సమావేశమయ్యారు. బొగ్గు అన్వేషణ లో 13 ద‌‌శాబ్దాల అనుభ‌‌వం ఉన్న సింగ‌‌రేణి సంస్థకు బొగ్గు పొర‌‌ల‌‌లో ఉన్న మిథేన్ గ్యాస్ వ‌‌న‌‌రులను అన్వేషించే సామర్థ్యం ఉందని సచివ్‌‌ కుమార్‌‌‌‌ అన్నారు. రాష్ట్రంలోని సింగ‌‌రేణి ఏరియాలలోని 6 జిల్లాల్లో కోల్ బెడ్ మిథేన్ గ్యాస్​ వనరులు ఉన్న 3 ప్రధాన బ్లాక్‌‌ల‌‌ను గుర్తించామ‌‌న్నారు. 

ఇందులో మంచిర్యాల, పెద్దప‌‌ల్లి, కొమ్రం భీం జిల్లాల్లో 5 బిలియన్​ క్యూబిక్​ మీటర్ల వనరులున్న ప్రాంతాన్ని ఒక బ్లాక్‌‌గా, భ‌‌ద్రాద్రి కొత్తగూడెంలో 2 బిలియన్​ క్యూబిక్​ మీటర్లున్న ప్రాంతాన్ని రెండో బ్లాక్‌‌గా, భ‌‌ద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో క‌‌లిపి 12 బిలియ‌‌న్ క్యూబిక్ మీట‌‌ర్ల గ్యాస్​ వనరులను మూడో బ్లాక్​గా గుర్తించామని తెలిపారు. ఈ మూడు బ్లాక్‌‌లలో మిథేన్​ గ్యాస్​ అన్వేషణ జ‌‌ర‌‌ప‌‌డానికి త్వరలో కేంద్రం నిర్వహించే వేలంలో పాల్గొనాల్సిందిగా ఆయన సింగరేణి సంస్థకు సూచించారు.