గుర్తింపు సంఘం ఎన్నికలపై సింగరేణి మెలిక

గుర్తింపు సంఘం ఎన్నికలపై సింగరేణి మెలిక
  • బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని వింతవాదన
  • ఆర్థిక సంవత్సరం ముగిశాక పెడితేనే మంచిదని సూచన

మందమర్రి, వెలుగు: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని, ఎన్నికల వల్ల బొగ్గు ఉత్పత్తికి విఘాత కలుగుతుందని యాజమాన్యం మెలికపెట్టింది. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు ఉత్పత్తికి అంతరాయం కలుగుతుందని సింగరేణి ప్రతినిధులు డీసీఎల్సీ ఎదుట వింత వాదన వినిపించారు. ఈ ఆర్థిక సంవత్సరం తర్వాతే ఎన్నికల నిర్వహిస్తే బాగుంటుందని చెప్పారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు సోమవారం హైదరాబాద్​లో కేంద్ర కార్మికశాఖ డిప్యూటీ చీఫ్ కమిషనర్ డి.శ్రీనివాసులు, సింగరేణి జీఎం పర్సనల్ ఆనందరావు, ఐఆర్ బాధ్యులు కవితానాయుడు తదితరులు భేటీ అయ్యారు. 

గతంలో పోటీ చేసిన కార్మిక  సంఘాలు, వాటి వార్షిక నివేదికలపై చర్చించారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఆర్థిక సంవత్సరం చివరి నాలుగు నెలలు బొగ్గు ఉత్పత్తి కీలకమన్నారు. ఈ టైమ్​లో ఎన్నికలు నిర్వహిస్తే బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని డీసీఎల్సీ దృష్టి తీసుకొచ్చారు. దేశ ఇంధన అవసరాలకు బొగ్గును మరింతగా సప్లయ్ చేయాల్సి ఉందన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిశాక ఎప్పుడైనా సిద్ధమంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు కోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు డిసెంబర్ 9న సింగరేణి కంపెనీ అభిప్రాయం తెలియజేయనున్నామని, కోర్టు నిర్ణయం ప్రకారం ముందుకు సాగుతామని సింగరేణి ప్రతినిధులు డీసీఎల్పీ ఎదుట వివరించారు.