
- రోజుకు 1.80 లక్షల టన్నుల ఉత్పత్తి, 2.10 లక్షల టన్నుల రవాణా సాధించాలని ఆదేశం
- సింగరేణి భవన్లో అన్ని ఏరియాల జీఎంలతో సీఎండీ సమీక్ష
హైదరాబాద్, వెలుగు: బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను పెంచుతూ సింగరేణి యాజమాన్యం కీలక నిర్ణయాలు తీసుకుంది. రోజుకు 1.80 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.10 లక్షల టన్నుల రవాణా సాధించాలని టార్గెట్‌గా నిర్దేశించుకుంది. బొగ్గు రంగంలో పోటీని ఎదుర్కొనేందుకు నాణ్యత పెంపు, ఉత్పత్తి వ్యయం తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎండీ ఎన్.బలరాం అన్ని ఏరియా జనరల్ మేనేజర్లకు స్పష్టం చేశారు. మంగళవారం సింగరేణి భవన్ లో అన్ని ఏరియాల జీఎంలతో జరిగిన సమీక్షా సమావేశంలో బలరాం మాట్లాడారు.
అనవసర ఖర్చులను నివారించి పొదుపు చర్యలు పాటించాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లక్ష్యాల సాధనలో అలసత్వాన్ని సహించబోమని హెచ్చరించారు. ఈ ఏడాది భారీ వర్షాల వల్ల ఉత్పత్తికి ఆటంకం కలిగినప్పటికీ, నష్టాన్ని పూడ్చుకోవడానికి రోజుకు 12.50 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని, భూగర్భ గనుల్లో ఉత్పత్తి పెంచాలని ఆదేశించారు. ‘‘యంత్రాలను మాగ్జిమమ్ వినియోగించాలి. ప్రతి ఉద్యోగి 8 గంటల షిఫ్ట్‌ను ఉత్పాదకత కోసం సద్వినియోగం చేయాలి.
కొత్తగూడెంలో వీకే కోల్ మైన్, ఇల్లందులో జేకే ఓసీ గనులను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. కొత్త ప్రాజెక్టులకు అనుమతులను వేగంగా సాధించాలి. ఈ ఏడాది ప్రారంభించనున్న మూడు గనుల ద్వారా 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. వచ్చే ఏడాది మరో 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి పెంచే అవకాశం ఉంది” అని సీఎండీ పేర్కొన్నారు. సింగరేణి ఆస్తుల పరిరక్షణ కోసం ఎస్టేట్స్ విభాగం అధునాతన సాంకేతికతను వినియోగించాలని, రికార్డులను ఆన్లైన్ లో నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు, కార్పొరేట్, ఏరియా జీఎంలు పాల్గొన్నారు.