హైదరాబాద్, వెలుగు: సింగరేణి దగ్గర ప్రస్తుతం 28.77 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని ఆ సంస్థ బుధవారం ప్రకటించింది. గతంలో కూడా బొగ్గు స్టాకులు ఉండేవని పేర్కొంది. 2014 నుంచి 2024 మధ్య సగటున 50 లక్షల టన్నుల బొగ్గు నిల్వల ఉండేవని, గతంతో పోల్చితే ఇప్పుడే అతి తక్కువ బొగ్గు స్టాక్ ఉన్నదని వెల్లడించింది. సింగరేణి బొగ్గు నిల్వలపై బీఆర్‌ఎస్‌నేత హారీశ్‌రావు ఇటీవల ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ సంస్థ స్పష్టతనిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది.
‘‘39 గనులు ఉన్న సింగరేణిలో నిత్యం బొగ్గు ఉత్పత్తి, రవాణా జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో కొంత మొత్తం స్టాక్‌గా ఉండటం అత్యంత సహజం. ఈ ఏడాది కూడా సింగరేణి సంస్థలో ఈ నెల 26వ తేదీ వరకు 28.77 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు వివిధ ఏరియాల్లోని గనులు, సీహెచ్పీల్లో ఉన్నాయి. గత పదేండ్ల స్టాక్ చరిత్రలో ఇదే అత్యల్పం’’ అని సంస్థ స్పష్టత ఇచ్చింది.
