- సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల అర్ధనగ్న ప్రదర్శన
కోల్బెల్ట్, వెలుగు: కోల్ మైన్స్ పెన్షన్ దారులకు చెందిన కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ సీఎంపీఎఫ్ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి అర్ధనగ్న ప్రదర్శన చేశారు.
అసోసియేషన్ ప్రెసిడెంట్ గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ.. కోల్కత్తా, ధన్బాద్లోని బొగ్గు గనుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(సీఎంపీఎఫ్) సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ (సీఎస్పీ) ప్రధాన కార్యాలయంలో రూ.3.64 కోట్ల విలువైన పెన్షన్ కుంభకోణం జరిగిందన్నారు. అవినీతికి పాల్పడ్డ ఆఫీసర్లను బర్తరఫ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 28 ఏళ్లుగా బొగ్గు గనుల రిటైర్డు ఉద్యోగుల పెన్షన్ పెంచలేదని, కరవుభత్యంతో కూడిన 50 శాతం పెన్షన్పెంచాలన్నారు. కనీస పెన్షన్ రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న, వైస్ ప్రెసిడెంట్లు ఎ.గంగయ్య, సదాశివచారి, ట్రెజరర్ బింగి రాజేశం, లీడర్లు పాల్గొన్నారు.
