గ్రీన్ ఎనర్జీ దిశగా సింగరేణి

గ్రీన్ ఎనర్జీ దిశగా సింగరేణి
  • థర్మల్ ప్లాంట్ పొల్యూషన్​కు చెక్​పెట్టే ఏర్పాట్లు
  • సల్ఫర్ ఉద్గారాలు 95% తగ్గించేందుకు ప్రత్యేక ప్లాంట్​
  • రూ.700 కోట్లతో జైపూర్​లో ఎఫ్​జీడీ ప్లాంట్
  • డిసెంబర్ నుంచి అందుబాటులోకి ప్రాజెక్ట్​
  • విండ్, హైడ్రోజన్ ప్లాంట్ల దిశగా యోచన

హైదరాబాద్, వెలుగు: సింగరేణి గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రానికి బొగ్గు, విద్యుదుత్పత్తితో వెలుగులు పంచుతున్న సింగరేణి.. వాటి ద్వారా వెలువడే కాలుష్యాన్ని తగ్గించడంపై దృష్టిసారించింది. సింగరేణి ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచుతూనే ఓపెన్ కాస్ట్ ఓవర్ బర్డెన్, సింగరేణి భూముల్లో, నీటి వనరుల్లో సోలార్ పవర్ ప్లాంట్​లను నిర్మిస్తూ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నది. అదే విధంగా గ్రీన్ హైడ్రోజన్ వంటి విప్లవాత్మక ప్రయత్నాల దిశగా ఆలోచనలు చేస్తున్నది. అంతే కాదు థర్మల్ ప్లాంట్ నుంచి వచ్చే పొగల నుంచి సల్ఫర్​ను తగ్గించుకోవడం ద్వారా ప్రకృతిపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నది.

రూ.700 కోట్లతో ఎఫ్ జీడీ ప్రాజెక్ట్

విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా బొగ్గును మండించడం ద్వారా వెలువడే సల్ఫర్ ఉద్గారాలను నియంత్రించేందుకు ఎఫ్​జీడీ (ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్) ప్రాజెక్టును సింగరేణి చేపట్టింది. జైపూర్​లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లో రూ.700 కోట్లతో నిర్మిస్తున్నది. ఎఫ్​జీడీ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం అనుమతులు రావడంతో శరవేగంగా పనులు చేస్తున్నది. ఏడాదిన్నర కింద మొదలైన పనులు సగానికిపైగా పూర్తయ్యాయి. డిసెంబర్ వరకు ఎఫ్​జీడీ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సింగరేణి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

95 శాతం సల్ఫర్ ప్యూరిఫై.....

 జైపూర్ లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఎఫ్​జీడీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్లాంట్​లో కరెంటు ఉత్పత్తి కోసం రోజుకు 16 వేల నుంచి 17వేల టన్నుల బొగ్గును వాడుతున్నారు. ప్లాంట్​లో బాయిలర్లను వేడి చేయడానికి బొగ్గును మండించడం ద్వారా పెద్ద ఎత్తున సల్ఫర్ డై ఆక్సైడ్, సల్ఫర్ మోనాక్సైడ్, కార్బన్ లెడ్ వంటి ప్రమాదకరమైన వ్యాయువులు వెలువడుతున్నాయి. ఈ విషవాయువుల తీవ్రతను తగ్గించడానికి రూ.700 కోట్ల వ్యయంతో ఎఫ్​జీడీ ప్రాజెక్ట్​ను నిర్మిస్తున్నారు. సల్ఫర్ డైయాక్సైడ్ ను నియంత్రించేందుకు లైమ్ స్టోన్​ను వినియోగించి ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ చేసి 95 శాతం వరకు విషవాయులను తగ్గిస్తారు. ఈ ప్రక్రియలో జిప్సమ్ ఉత్పత్తి అవుతుంది. సిమెంట్ తయారీ, జిప్స్​ బోర్డులు, వ్యసాయ ఎరువుల్లో జిప్సమ్ వాడుతారు. జిప్సమ్​అమ్మకం ద్వారా టన్నుకు రూ.700 నుంచి రూ.1000 చొప్పున ఆదాయాన్ని సమకూర్చుకునే చాన్స్ ఉంది. 

సోలార్​తో జీరో బిల్లింగ్​..

గ్రీన్ ఎనర్జీలో భాగంగా సింగరేణి పెద్ద ఎత్తున సోలార్ వైపుకు అడుగులు వేస్తున్నది. సింగరేణి వ్యాప్తంగా 500 మెగావాట్ల కెపాసిటీ గల సోలార్ ప్లాంట్​లను నిర్మించాలని టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికే సింగరేణిలోని ప్రాంతాల్లోని ఓపెన్ కాస్ట్​ గనుల వద్ద ఉండే మొరం కుప్పలు, సింగరేణి స్థలాల్లో 284 మెగావాట్ల సోలార్ ప్లాంట్​ను ఏర్పాటు చేసింది. అదే విధంగా జైపూర్​లోని థర్మల్ ప్లాంట్ వద్ద వినియోగించే నీటి జలాశయంలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్​ను ఏర్పాటు చేసింది. మరో 220 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే సింగరేణి పవర్ జనరేషన్​లో స్వయం సమృద్ధి సాధించే వీలుంటుందని అధికారులు అంటున్నారు. సోలార్​ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా సొంతంగా కరెంటు ఉత్పత్తి చేస్తూ నెలకు డిస్కంకు కట్టే కరెంటు బిల్లులు రూ.400కోట్లను తగ్గించుకునే అవకాశం ఉంది. ఇవి పూర్తి చేస్తే సింగరేణి తాను సొంతంగా ఉత్పత్తి చేసిన సోలార్ పవర్​తో అన్ని మైన్​లలో కరెంట్​ను వాడుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నం: సీఎండీ బలరామ్​

ఐదేండ్లుగా సింగరేణి వ్యాప్తంగా మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నట్టు సింగరేణి సీఎండీ బలరామ్ నాయక్ తెలిపారు. రామగుండం, శ్రీరాంపూర్, భూపాలపల్లి, కొత్తగూడెం ఏరియాల్లోని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల ఓవర్ బర్డెన్ డంపింగ్ తో పాటు, రోడ్లు, రహదారులతో పాటు సింగరేణి సంస్థల పరిసర ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో 18వేలకు పైగా మొక్కలు నాటినట్టు చెప్పారు. అవన్నీ ఇప్పుడు పెరిగి అడవులను తలపిస్తున్నాయన్నారు. ప్రత్యేక అటవీ విభాగాన్ని ఏర్పాటు చేసి వనాలను పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

విండ్, హైడ్రోజన్ ప్లాంట్ దిశగా..

సింగరేణి ఇప్పటి వరకు థర్మల్, సోలార్ పవర్ జనరేషన్ మాత్రమే చేపడుతున్నది. భవిష్యత్తులో విండ్ పవర్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్​లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కోసం సంప్రదింపులు జరపడంతో పాటు సాధ్యాసాధ్యాలపై స్టడీ చేస్తున్నది.