
హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. పార్టీ ప్రస్తుత పంథాను వ్యతిరేకిస్తూ ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఈ క్రమంలో మల్లోజుల, ఆశన్న లొంగుబాటుపై మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ స్పందించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు. లొంగుబాట్లు విప్లవ ఉద్యమాన్ని ఆపలేవని.. అంతిమంగా విప్లవానిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
50 ఆయుధాలను శత్రువులకు అప్పగించడం విప్లవాన్ని హత్య చేయడమేనని మల్లోజుల, ఆశన్నలపై విమర్శలు గుప్పించారు. శత్రువుకు లొంగిపోయిన వారు విప్లవ ప్రతిఘాతకులు, విచ్ఛిత్తి ద్రోహులని విమర్శించారు. మల్లోజుల, ఆశన్నలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యమానికి ద్రోహం చేసిన వీరిద్దరికి విప్లవ ప్రజలు తగిన విధంగా శిక్షించాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారు సుఖానికి, స్వార్థానికి అలవాటు పడ్డారని విమర్శించారు.